Thursday 8 March 2012

చెత్త పని - 4: అసలు సంగతి

ఇంతకు ముందు టపాల్లో చెప్పుకున్నట్లు అందరూ చక్కగా చెత్తని వేరుచెయ్యటం, కంపోస్టు చెయ్యటం అలవాటు చేసుకుంటే నిజంగా కొద్దికాలంలోనే చాలా మార్పుని చూడొచ్చు. చెయ్యటానికి కష్టం అనుకోవటానికి కూడా లేదు - కొన్ని పశ్చిమ యూరోప్ దేశాలలో ఇది చాలా మామూలు విషయం. అక్కడ ప్రతి మున్సిపాలిటీ దీన్ని ఖచ్చితంగా పాటించటం వల్ల అందరూ అలవాటు పడిపోయారు.

నిజానికి అక్కడ ఈ ఒక్క విషయంలోనేకాక చాలా విషయాలలో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్నా, సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నాసరే, చాలా మందిని అప్పుడప్పుడు ఆఫీస్‌కి సైకిల్ మీద రావటం చూస్తాము. అలాగే మనలా వారికి అంతగా ఎండ లేకపోయినా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించుకోవటానికి ప్రయత్నిచటంలాంటివి ఎన్నో మనం చూడొచ్చు.

మరి ఇక్కడ మనం చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఊరిచివర పోగుపడుతున్న ప్లాస్టిక్ కుప్పలని చూస్తూనే ఉన్నాం. మారుమూల గిరిజన పల్లెలలో కూడా టూరిస్టుల పుణ్యమా అని ప్లాస్టిక్ వాడటం పెరిగిపోయింది. వాడాక మామూలు చెత్తతో కలిపి పారెయ్యటం, చెత్త కుప్ప పెద్దదయ్యాక అప్పుడప్పుడు తగలబెట్టటం. అంతే.

పోల్చి చూసుకుంటే చాలా బాధగా ఉంది కదా? అవును అనిపిస్తే మీరు ఈ టపా చివరివరకు చదవాల్సిందే. కాదు అనిపిస్తే ప్రకృతి పట్ల నిజంగా బాధ్యత అంటే ఏమిటో మీరు తెలుసుకున్నట్లే :-)

గందరగోళంగాఉంది కదూ? కొంచెం వివరంగా చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌లో ఈ చివరి టపా ప్రత్యేకంగా వ్రాస్తున్నాను. ఓపిక చేసుకుని ఒకసారి మనసు పెట్టి చదవండి:

అసలు పర్యావరణ స్పృహ, ప్రకృతి పట్ల ప్రేమ, వగైరా వగైరా మాటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా? వీళ్ళందరూ ఎక్కువగా ఏమి చెప్తున్నారో ఒక్కసారి చూద్దామా? చెత్తను వేరు చెయ్యండి, చెట్లు పెంచండి, వన్యప్రాణులను ప్రేమించండి, అడవుల్లో టూర్‌కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాడకండి, బయో డిజిల్‌లాంటివి వాడండి, మూగ జంతువులను, పక్షులను వీలైనంతలో పోషించండి, గట్రా, గట్రా.

ఇవన్నీ మంచి పనులే, సందేహం లేదు. తప్పకుండ చెయ్యాల్సినవి కూడా. కాని ఇలాటివన్ని చేసేసి నావంతుగా నేను ప్రకృతి పట్ల బాధ్యతగా ఉంటున్నాను అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. కచ్చితంగా సరిపోదు. పైగా ఇలాంటివి మాత్రమే చేసి నేను బాధ్యతగానే ఉంటున్నాను అనుకోవటం మనల్ని మనం మోసం చేసుకోవటమే! ఎందుకంటే ఇలాంటివి అందరూ చేసే సమాజ సేవలాంటివి. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోకుండా, సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా, మన ఆత్మ సంతృప్తికోసం చేసే పైపై సహాయాలు ఇవన్నీ!

ఒక్క సారి ఆలోచించండి: పర్యావరణంలో ఇంతగా ఈరోజు సమతుల్యత లోపించింది అంటే అది అంతా మన జీవన విధానమే కదా? అసలు నిజంగా అన్నీ మనకి అవసరమైంతమేరకే ప్రకృతినుంచి తీసుకుంటున్నామా?







  • హంగు ఆర్భాటాలకోసం ఇంట్లో తెచ్చి పడేసుకున్న ఫర్నిచర్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అలా అందరి అవసరాలకోసం ఎన్ని అడవులు నరకాల్సి వస్తుందో ఆలోచన చేస్తున్నామా? ఆ మాత్రం స్పృహ లేకుండా ఎకో-టూరిజం పేరిట అడవుల్లో షికారుకు వెళ్ళటం ఎవరిని ఉద్దరించటానికి?



  • సైకిల్ మీద వారానికి ఒకసారి ఆఫిస్‌కి వెళ్తూ, మిగతా రోజుల్లో ఒక్కడే సొంత కార్‌లో తిరగటం ఎవరిని మోసం చెయ్యటానికి?



  • అవసరం అయినదానికి, కానిదానికి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎడా పెడా వాడేస్తూ, ఇంటిమీద సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే పర్యావరణ మిత్ర అయిపోతామా?



  • ఆకలి తీర్చుకోవటానికి కాక, రుచుల కోసం అన్ని రకాల ప్యాక్‌డ్ ఫూడ్ తెచ్చుకుని తింటూ, వాటి కవర్లు మాత్రం చక్కగా రీసైకిల్ చెయ్యటం బాధ్యతేనా?



  • షాపింగ్ పేరిట కంటికి నచ్చింది కొనిపడెయ్యటం తప్ప, అలా వినియోగ సంస్కృతి పెరగటం వల్ల ప్రకృతి వనరులు ఎంతగా కుంచించుకుపోతున్నాయో అని పట్టిందా మనకు?



  • మన మన ఇళ్ళళ్ళో వాననీటి సంరక్షణ గురించి పట్టించుకుంటున్నామా?



  • ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొంతమేరకైనా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే ఆలోచన ఏమైనా ఉందా?
ఇవన్నీ వినటానికి కటువుగా ఉండచ్చు, కానీ పచ్చి నిజాలు. మనం తెలుసుకోవాల్సిన, నమ్మి తీరాల్సిన నిజాలు. నిజాయితీగా మనం ప్రకృతిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోగలగాలి అంటే, అన్నిటికంటే ముందు మనం మన మన జీవన విధానాల్ని సమీక్షించుకోవాలి. ప్రతి రోజూ, పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేబోయే వరకు అసలు మనం ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నాం, అందులో ఎంత నిజంగా అవసరం, ఎంత అవకాశం అని ప్రశ్నించుకోవాలి. అంతవరకు "ఐ లవ్ నేచర్" లాంటి స్లోగన్‌లు మానుకుందాం!

Sunday 27 November 2011

చెత్త పని - 3: ఇంట్లోనే కంపోస్టు తయారీ


ఇంతకుముందు టపాల్లో చెప్పుకున్నట్లు మన వంటింటి చెత్త నుంచి అతితేలికగా కంపోస్టు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

వివరాల్లోకి వెళ్ళేముందు తేలిగ్గా అవగాహన అవటానికి మనం ఇంతకుముందు అనుకున్న అరటి తొక్క గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆరుబయట పారేసిన అరటి తొక్క మనం చూస్తూ ఉండగానే కంపోస్టు అయ్యి భూమిలో కలిసిపోతుంది కదా! ఇక్కడ అసలు ఏం జరిగింది? ఎలా అరటి తొక్క అంత తేలిగ్గా ఎవరికీ శ్రమ ఇవ్వకుండా ఎలా కంపోస్టు అయ్యింది?? 

ఆరుబయట గాలిసోకుతున్న ఏ ఆహార పదార్థమైనా అందులోని సూక్ష్మ క్రిములవల్ల మెల్లగా కుళ్ళిపోయి నేలలో కలిసిపోతుంది. అంతే! ఇంతకంటే ఈ విషయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన/నేర్చుకోవాల్సిన బ్రహ్మ పదార్థమేమీ లేదు!!             

ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని మన వంటింట్లోకి ఎలా అన్వయించుకుందామో చూద్దాం. ఇందుకు మనం చెయ్యాల్సిందల్లా ...  

1. వంటింటి చెత్తని వేరుచెయ్యటం: వంటింట్లో మిగిలిన ఆహారాన్ని (కూరగాయముక్కలు, ఆకులు, మిగిలిపోయిన అన్నం, కూర వగైరా) మిగతా చెత్తతో కలపకుండా కంపోస్టుకోసం వేరుగా ఉంచటం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం క్రింద జల్లెడలా ఉన్న గిన్నె ఏదైనా వాడొచ్చు - అయితే ఈ గిన్నెని ఇంకొంచెం పెద్ద గిన్నెలో ఉంచి పెట్టుకోవాలి. ఎందుకో మీకీపాటికే అర్థం అయిఉంటుంది: పై గిన్నెలో ఒకవేళ ఎక్కువ నీరు ఉంటే అది మెల్లగా క్రింద గిన్నెలోకి దిగిపోతుంది. ఎక్కువ చెమ్మ ఉంటే కంపోస్టు త్వరగా కాదు మరి!  

2. ఎప్పటికప్పుడు:  ఇలా విడిగా పెట్టుకున్న గిన్నెని ఏ పూటకా పూట మన కంపోస్టు కుండలలోకి ఖాళీ  చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మనం కంపోస్టు చెయ్యబోతున్న వంటింటి చెత్తలో ఎంత ఇంకిపోయినా చెమ్మ ఎక్కువగానే ఉంటుంది. అందుకే దీన్ని మనం కంపోస్టు కుండలలో వేసేటప్పుడు తప్పకుండ పేపరు ముక్కలు లేదా ఎండు ఆకులు కలిపి వెయ్యాలి (బయట పారేసిన అరటి తొక్కకి ఈ సమస్యలేదు..కుండిలో కాకుండా ఆరు బయటే ఉంది కాబట్టి ఎంచక్కా గాలికి తడారిపోతుంది)

 3. ఇక అసలు సంగతి - కంపోస్టు కుండలగురించి.  ఇలా అనగానే ఇందుకోసం ఎదో ప్రత్యేకంగా తయారుచేసిన కుండలు గట్రా వాడాలేమో ఆనుకోకండి! మనకి కావాల్సిందల్లా ఒకదానిమీద ఒకటి పేర్చుకోవటానికి (ఇది కూడా కేవలం ఖాళీ ఆదా చేసుకోవటానికి, అలా కుదరకపోయినా ఇబ్బంది లేదు)  వీలుగా ఉన్న 3 కుండలు. అయితే వీటికి గాలి ఆడటానికి వీలుగా చుట్టూ చిన్న చిన్న బెజ్జాలు  మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఈ కుండలు ఒకదానిమీద ఒకటి పేర్చినప్పుడు ఇలా ఉంటాయి: 

ఇప్పుడు మనం వంటింటి చెత్తని మొదట పైనున్న కుండలో వెయ్యటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఇది నిండి పోతుందో, అప్పుడు దాన్ని క్రిందకి మార్చి రెండో కుండలో వెయ్యటం మొదలు పెట్టాలి. ఇలానే తర్వాత మూడో కుండలోకి.                

4. కలియపెట్టటం: ఇప్పుడు మనం అప్పుడప్పుడు (వారానికొక్కసారి) చెయ్యాల్సిన పని ఒకటుంది. ఎంతగా మనం బెజ్జాలు ఉన్న కుండల్లో ఉంచినా గాలి సరిగ్గా ఆడదు కాబట్టి అప్పుడప్పుడు కలియపెట్టాలి.అలా చేసేటప్పుడు వేలైతే వీపపొడి, పసుపు కలుపుకోవచ్చు.     

  
ఇంతేనా? ఇంతకీ మనం ఇందులో కంపోస్టు ఎక్కడ తయారుచేసాం??  

ఈ ప్రశ్నకి సమాధానం మీకు ప్రకృతే చెప్తుంది - ఎందుకంటే అసలు పని చేసింది ప్రకృతే కాబట్టి. మనం కేవలం అందుక్కావాల్సిన ముడి సరుకులు (చెత్త, గాలి) అందించాం. అంతే!!  

ఈ విషయం మీ అంతట మీరు తెలుసుకోవటానికి కొన్నాళ్ళు పోయాక మూడు కుండలు గమనించండి...     

మొదటి కుండలో అప్పుడప్పుడే వేస్తున్న వంటింటి చెత్త: 

రెండో కుండలో  దానంటతదే తయారవుతున్న కంపోస్టు:

ఇక మూడో కుండలో మనం మొక్కలకి వాడుకోవటానికి సిద్దంగా కంపోస్టు:  

తెలుసుకున్నారు కదా? తప్పకుండా మీమీ ఇళ్ళల్లో కంపోస్టు తయారు చెయ్యటం మొదలుపెడతారని ఆశిస్తాను. మీకు ఎమైనా సహాయం చెయ్యగలను అనుకుంతే తప్పకుండా నన్ను సంప్రదించండి! ఇంతకుముందు చెప్పినట్లు కంపోస్టు  చెయ్యటం మొదలు పెట్టాక  మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది    

ఇంకొక ముఖ్యమైన విషయం:  చెత్త సమస్యకి పరిష్కారం కేవలం ప్లాస్టిక్ వాడకం తగ్గించటం, చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చేసుకోవటమే కాదు. వీటన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన/మార్చుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటో వచ్చే టపాలో చెప్పుకుందాం! 

Sunday 28 August 2011

చెత్త పని - 2 : మూలాల్లోకి...

చెత్తవల్ల సమస్యల గురించి తెలుసుకున్నాం. మరి వెంటనే కార్యాచరణ మొదలెట్టేద్దామా? ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, వేర్వేరు రకాల చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చెయ్యటం వగైరా వగైరా...

అలా ఎకాయెకిన లేడికి లేచిందే పరుగు అన్నట్టు పనిమొదలుపెట్టేస్తే, నాకుతెలిసి కేవలం రెండే రెండు నెలల్లో మనం తిరిగి ఇప్పటి అలవాట్లకే వెనక్కి వచ్చేస్తాం! ఎందుకంటే ఈ విషయంలో సరైన అవగాహన, దృక్పథం చాలా అవసరం. అవి లోపించబట్టే ఇన్నాళ్ళుగా మనం ఇలాంటి మార్పుకి అలవాటుపడలేకపోతున్నాం. కొంచెం వివరంగా చెప్పాలంటే...

ప్లాస్టిక్ వాడొద్దు అని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నామనుకోండి...రేపట్నుంచి చక్కగా పేపర్ సంచులు గట్రా మొదలుపెట్టేస్తాం. నిజమే..మనం తప్పకుండా ఆచరించాల్సిన విషయం ఇది - ప్రతి ఊరిచివర పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలను కళ్ళారా చూస్తునే ఉన్నాం కదా! కాని వంటింట్లో మిగిలినది, ఇంకా మిగతా చెత్త సంగతి?? దాన్నిమాత్రం చక్కగా చెత్తకుప్పలో పారేసి వస్తాం. ఈ మిగిలిన చెత్తని తీసుకెళ్లటానికి మున్సిపాలిటీ ట్రక్ ఎప్పటిలానే వస్తుంది. ఎప్పటిలానే అంతా తీసుకెళ్ళి ఊరిచివర పారేసి తగలబెట్టేస్తారు. అంటే ఈ విషయంలో మనకి సరైన అవగాహన లేక ఎలాగొలా వదిలించుకోవాలని చూస్తున్నట్లే కదా?

అసలు దేన్నైనా "చెత్త" అంటున్నామంటే అది పనికిరానిదని కాదు! దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏంచెయ్యాలో మనకి తెలియదని..అంతే! అలాంటప్పుడు లోపం మనది కాదా?

ఒక్కసారి మూలాల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం...

ఎప్పుడైనా ఆరుబయట పడి ఉన్న అరటి తొక్కనో, కూరగాయల ముక్కల్నో గమనించారా? ఒక రోజు, రెండు రోజులు, ఒక వారం కనిపిస్తాయి. తర్వాత? ఏమైపోయాయి?? మనం తీసికెళ్ళి ఎక్కడా పారెయ్యకుండానే, ఎక్కడా తగలబెట్టకుండానే వాటంతటవే నేలలో కలిసిపోలేదూ???

అమ్మ (ప్రకృతి) చెప్తున్న ఈ చిన్న విషయం అర్థం చేసుకోగలిగితే చాలు. మనం ఎక్కడ మొదలు పెట్టాలో తేలిగ్గా అర్థం అవుతుంది. మనం వాడే ప్రతి వస్తువునీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో తిరిగి అక్కడికి చేర్చటమే మనం చెయ్యాల్సిందల్లా! ఇంకా వివరంగా చెప్పాలంటే..

1. వంటింటి చెత్త: పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ నేలనుంచి కదా మనకి వచ్చేది? అందుకని ఈ చెత్తని తిరిగి నేలకే ఎరువుగా అందజెయ్యాలి (ఇది ఎంత తేలిగ్గా ఇంట్లోనే చెయ్యొచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం)

2. ప్లాస్టిక్: తప్పని సరై ప్లాస్టిక్ లాంటివి వాడుతున్నప్పుడు వాటిని తిరిగి రీసైకిల్ చేసే సంస్థలకి పంపించొచ్చు. ఎందుకంటే వీటిని అలా విసిరి పడేస్తే నేలలో కలిసిపోవు; తగలబెట్టనూకూడదు (ఈ విషయం ఇప్పటికీ చాలమందికి తెలియదు)

3. ఇనుము, మెటల్ గట్రా: వీటిని మిగతా వాటితో కలపకుండా, రీసైకిల్ చేసే సంస్థలకి పంపడమే

4. హానికరమైన చెత్త: ఎలక్ట్రానిక్, మెడికల్ లాంటివన్న మాట. మిగతా వాటికంటే కొంచెం కష్టం. ఎలక్ట్రానిక్ చెత్తని కూడ రీసైకిల్ చేసే సంస్థలు ఉన్నాయి. మెడికల్‌కి మాత్రం హాస్పిటల్స్ దగ్గర కనుక్కోవాల్సిందే

"పోద్దురూ...ఇంత వివరంగా చెత్తని వేరు చేసి ఏది ఎక్కడ ఇవ్వాలో కనుక్కుని మరీ చెయ్యాలా? అయ్యే పని కాదు!" అని అనేసుకుంటున్నారా?? అనుభవంతో చెప్తున్నాను..చాలా తేలిక పని. పోనీ ఇంకా తేలిగ్గా మొదలెడదామా??

ముందుగా వంటింటి చెత్త మాత్రం వేరుచెయ్యండి. ఇది మాత్రం బయట పడెయ్యకుండా కంపోస్టు చేద్దాం. ఎంచక్కా మన కుండీల్లో మొక్కలకే ఎరువుగా వాడుకోవచ్చు! ఇది అనుభవంలోకి వచ్చాక మిగతావి మొదలుపెడుదురు కాని. ఎందుకంటే, ప్రకృతి ఎంత తేలిగ్గా వంటింటి చెత్తని ఎరువుగా మార్చుకుని తనలో కలుపుకుంటుందో ఒకసారి మీ కళ్ళతో మీరే చూసాక, అసలు చెత్త గురించి మీకిప్పటిదాకా ఉన్న దృక్పథమే మారిపోతుంది! ఈ మార్పు గురించే టపా మొదట్లో చెప్పింది. ఇంకో విషయం...కేవలం ఇలా కంపోస్టు చెయ్యటం వల్లే మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది

ఇలా ఉభయతారకంగా కంపోస్టును ఇంట్లోనే అతి సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం...