Tuesday 8 April 2008

లేక్ వ్యూ అపార్టుమెంటు - హిల్ వ్యూ రిసార్టు

గమనిక: టపా మొదలు చూసి ఇదేదో పిల్ల రచయిత ప్రకౄతి వర్ణనకు చేసే ప్రయత్నమో, లేక నా సొంత బాకానో అనుకునేరు సుమా :-) ఓపికుంటే చివరివరకు చదవండి.

ఈ మధ్యే బెంగుళూరు శివార్లలో నా కష్టార్జితంతో - అంటే ఆర్జించినది, మరియు ఆర్జింపబోవునది(హోమ్ లోన్) అని చెప్పుకోవాలి - కొన్న అపార్టుమెంటులోకి గౄహప్రవేశం చేశాము. బుక్ చేసిన టైంలో బిల్డరు ఊదరగొట్టిన హంగులతోపాటు మా ఈ అపార్టుమెంటుయొక్క అదనపు ఆకర్షణ లేక్ వ్యూ అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.శివారుప్రాంతం అని చెప్పాను కదా, చుట్టుపక్కల ఇంకా ఏమీ ఇళ్ళు లేవు...బాల్కనీలోనుంచి మూడు దిక్కులా కనుచూపుమేర పచ్చదనమే. ఏపుగా పెరిగిన కొబ్బరి తోటలు, వరి చేలు, ఈ పచ్చదనం మధ్య జలకళతో ఉట్టిపడుతున్న నిండైన చెరువు! నీరెండలో ఈ సౌందర్యాన్ని కళ్ళారా చూడాలే తప్ప వర్ణింపనలవి కాదు!

మొన్నా మధ్య కేరళలోని మున్నార్ కి విహార యాత్రకని వెళ్ళాను. అసలే ప్రకౄతి ప్రేమికుడిని కదా...రెండు నెలలు శోధించి, టూర్ ఆపరేటర్లను వేధించి, అద్భుతమైన రిసార్టుని బుక్ చేశాను. నిజం చెప్పొద్దూ..వెళ్ళి చూసాక నా సెలెక్షన్ని నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను! ఈ మధ్యే కట్టిన రిసార్టు అది...కొండ కొమ్మున ఉంది, కేవలం పచ్చరంగునే వాడి సౄజించిన ఓ అద్భుతమైన పెయింటింగ్ లా ఉంది ఆ పరిసర వీక్షణం! పనిగట్టుకు చూసినా ఎక్కడా జనావాసాలే అగుపించవు మరి! అనుక్షణం ఆనందానుభవం ఆ యాత్ర..

******************************************

మా అపార్టుమెంటుకి పదేళ్ళునిండాయి. మొన్నీమధ్యే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాం. కాని ఇప్పుడు అపార్టుమెంటు గురించి చెప్పుకోవటానికి ఆకర్షణ అంటూ ఏమీ లేదు. ఇప్పుడది శివారుప్రాంతం కాదు, నగరంలో పేరొందిన ఓ కాలనీ. బాల్కనీ లో కూర్చుని ఆస్వాదించటానికి చుట్టూ పచ్చని చేలు ఏమీ లేవు...పిచ్చుకగూళ్ళలాంటి బిల్డింగులు తప్ప. ఇప్పుడా చెరువు ఉందోలేదో కూడ తెలియదు...ఆ వ్యూ కి అడ్డంగా బిల్డింగులు వచ్చి చాలాకాలం అయ్యింది. చుట్టు పక్కల బోర్లు ఎక్కువై, నీళ్ళు చేరే దారులు కూడా మూసుకుపోయి, ఇప్పుడందులో నీళ్ళు కూడా అడుగంటాయని అంటున్నారు :-(

ఆ కేరళ రిసార్టుకి కూడా పదేళ్ళు నిండాయి. ఈ మధ్యే మా కొలీగ్ వెళ్ళివచ్చాడు. అక్కడ కూడా అదే పరిస్థితట. టూరిస్టులు బాగా పెరగటంతో రిసార్టులూ ఎక్కూవయ్యాయి, ఊరూపెరిగింది, చుట్టూరా కాంక్రీట్ జంగిల్ తప్ప కొండాకోనలున్న ఆనవాళ్ళు ఎమీ లేవని అన్నాడు. పదేళ్ళలో ఎంతమార్పు...ఆలోచిస్తుంటే మనసుకి ఎలాగో అనిపిస్తుంది. అప్పటి స్వచ్చమైన గాలి, అందమైన ప్రకౄతి ఇప్పుడెక్కడ? లోకం ఇలా మారిపొతుంటే నాబోటి ప్రకౄతి ప్రేమికుని గతేంకాను?? ఈ నగరీకరణ మనల్ని ఎటు తీసుకుపోతుంది?

******************************************

ఇలా అనుక్షణం ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఓ శుభోదయాన బాల్కనీలో కూర్చుని ఉండగా జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రకౄతి ప్రేమికుడు గడచిన పదేళ్ళలో ప్రకౄతికేమి చేసాడనే ప్రశ్న బుర్రలో ఉదయించింది. చుట్టూ వచ్చి పడుతున్న బిల్డింగుల వల్ల చేలన్నీ మాయమైపోతుంటే నిట్టూరుస్తూ కూర్చోవటం తప్ప ఇప్పటి వరకు సొంత అపార్టుమెంటులో ఓ చెట్టు(మొక్క) కూడా నాటలేదే! మరి మొదటి చేను మా అపార్టుమెంటుకే కదా బలి అయ్యింది!! రోజూ వేల లీటర్ల చొప్పున బొరునుంచి నీటిని తోడటమే తప్ప ఎన్నడైనా వాన నీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అనే ఆలోచనే రాకపోయెనే! చుట్టూ జనావాసాలే కనిపించని రిసార్టుకోసం వెతికి మురిసిపోయానే తప్ప అదే పచ్చని ఆ పరిసరాలలో మొదటి మచ్చ అని తట్టలేదే!

ఇతరులమీద నెపం వేసి తప్పించుకోవటం తేలికే. మన పక్కవాడికి మనం కూడా "ఆ ఇతరుల" లో ఒకళ్ళమే!