Sunday 19 June 2011

ముసుగు

కొన్నాళ్ళ క్రిందటి ఒక సాదా సీదా ఘటన..

దేశంకాని దేశంలో ఓ శుభోదయాన ఆఫీస్‌కి వెళ్ళటానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తూ, దారెంబడి వచ్చిపోయే కార్లనీ, దారి పక్కన విచ్చుకున్న గడ్డి పూలనీ, తేట తెలుగులాంటి ఆకాశాన్ని చూస్తూ, ఆలోచిస్తూ ఉండగా...

ఎదురుగా ఓ పెద్దాయన..మొహమాటం లేకుండా తిన్నగా నా దగ్గరకి వచ్చేసి, చుట్టూ ఉన్న చెట్లనీ, ఎగురుతున్న పిట్టలనీ నాకు చూపిస్తూ ఏదో చెప్పటం మొదలెట్టారు..

జర్మన్ భాషలో అక్షరాలు, అంకెలు తప్ప పై తరగతులు చదువుకోని నాకు ఆయన చూపించేవి కనబడటం తప్ప, చెప్పేది ఒక్క ముక్కా అర్థం కాలేదు; అర్థం కాలేదు పాపం అని ఆయన కూడా పెద్దగా జాలి చూపించలేదు! ఈ సారి నీలాకాశం, ఋతువులు అలా అలా సాగింది వాక్ప్రవాహం ...

ఆ ప్రవాహం అలా ఆయన అత్త మామలగురించి, చిన్నప్పటి సంగతుల గురించి, రెండో ప్రపంచ యుద్దం గురించీ, ఇలా మరెన్నో పాయలను కలుపుకుని స్వరరాగ గంగా ప్రవాహంలా మారుతుండగా, నాకు ఓ విషయం స్ఫురించింది. ఆయన మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కాక పోయినా, చెప్పే విషయం మాత్రం అర్థం అవుతుంది నాకు..స్పష్టంగా! అంతే కాదు, ఆయన చెప్పేది నాకు సోదిలా అనిపించటం లేదు. ప్రతి మాటా మనసు పెట్టి వింటున్నాను..ఏదో మొహమాటనికి నటించకుండా. ప్రతిస్పందిస్తూ.

ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఒక మతం కాదు, ఒక వయసు కాదు. ఏదీ సరి పోలదని ఆయనికీ తెలుసు. అయినా నాతో మాట్లాడాలని, నాకు అర్థం కాకపోయినా నాకు ఎదో చెప్పాలని ఆయనికి ఎందుకు అనిపించింది??

స్థూలంగా చూస్తే ఇది అంతగా పట్టించుకోవలసినవసరం లేని ఒక సాదా సీదా ఘటనే - ఉబుసుపోక ఓ పెద్ద మనిషి చెప్పిన కబుర్లు. కాని నిజంగా ఇందులో ఎమీ లేదా?

మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నిజాయితీగా మనసులో భావం పంచుకోవటానికి అసలు నిజంగా భాషతో అవసరం ఉందా? ఇలా మనసుతో మాట్లాడే అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఆ అవకాశం మనం కల్పించుకుంటున్నామా?

అసలు ఇలా మనం సాటి మనిషితో మాట్లాడి ఎన్నాళ్లయింది - మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకుని, మొహమాటలు, భేషజాలు లేకుండా? నోరు తెరిచి ఒక మాట చెప్పుకోవటానికి ఎన్నో వడపోతలు. అంతకు ముందు మనలోపలి మనిషి మీద కప్పుకున్న ఎన్నో ముసుగులు!

మార్చుకోవటానికీ, నేర్చుకోవటానికీ జీవితంలో అనూహ్యమైన మలుపులు, అపూర్వమైన మనుషులే తారసపడనవసరం లేదు. అర్థం చేసుకునే హృదయం, స్పందించే మనసు ఉంటే మనకు ఎదురై ప్రతిఘటనా, ప్రతిమనిషి, నేర్పించే గురువులే కదా!