Thursday 8 March 2012

చెత్త పని - 4: అసలు సంగతి

ఇంతకు ముందు టపాల్లో చెప్పుకున్నట్లు అందరూ చక్కగా చెత్తని వేరుచెయ్యటం, కంపోస్టు చెయ్యటం అలవాటు చేసుకుంటే నిజంగా కొద్దికాలంలోనే చాలా మార్పుని చూడొచ్చు. చెయ్యటానికి కష్టం అనుకోవటానికి కూడా లేదు - కొన్ని పశ్చిమ యూరోప్ దేశాలలో ఇది చాలా మామూలు విషయం. అక్కడ ప్రతి మున్సిపాలిటీ దీన్ని ఖచ్చితంగా పాటించటం వల్ల అందరూ అలవాటు పడిపోయారు.

నిజానికి అక్కడ ఈ ఒక్క విషయంలోనేకాక చాలా విషయాలలో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్నా, సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నాసరే, చాలా మందిని అప్పుడప్పుడు ఆఫీస్‌కి సైకిల్ మీద రావటం చూస్తాము. అలాగే మనలా వారికి అంతగా ఎండ లేకపోయినా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించుకోవటానికి ప్రయత్నిచటంలాంటివి ఎన్నో మనం చూడొచ్చు.

మరి ఇక్కడ మనం చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఊరిచివర పోగుపడుతున్న ప్లాస్టిక్ కుప్పలని చూస్తూనే ఉన్నాం. మారుమూల గిరిజన పల్లెలలో కూడా టూరిస్టుల పుణ్యమా అని ప్లాస్టిక్ వాడటం పెరిగిపోయింది. వాడాక మామూలు చెత్తతో కలిపి పారెయ్యటం, చెత్త కుప్ప పెద్దదయ్యాక అప్పుడప్పుడు తగలబెట్టటం. అంతే.

పోల్చి చూసుకుంటే చాలా బాధగా ఉంది కదా? అవును అనిపిస్తే మీరు ఈ టపా చివరివరకు చదవాల్సిందే. కాదు అనిపిస్తే ప్రకృతి పట్ల నిజంగా బాధ్యత అంటే ఏమిటో మీరు తెలుసుకున్నట్లే :-)

గందరగోళంగాఉంది కదూ? కొంచెం వివరంగా చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌లో ఈ చివరి టపా ప్రత్యేకంగా వ్రాస్తున్నాను. ఓపిక చేసుకుని ఒకసారి మనసు పెట్టి చదవండి:

అసలు పర్యావరణ స్పృహ, ప్రకృతి పట్ల ప్రేమ, వగైరా వగైరా మాటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా? వీళ్ళందరూ ఎక్కువగా ఏమి చెప్తున్నారో ఒక్కసారి చూద్దామా? చెత్తను వేరు చెయ్యండి, చెట్లు పెంచండి, వన్యప్రాణులను ప్రేమించండి, అడవుల్లో టూర్‌కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాడకండి, బయో డిజిల్‌లాంటివి వాడండి, మూగ జంతువులను, పక్షులను వీలైనంతలో పోషించండి, గట్రా, గట్రా.

ఇవన్నీ మంచి పనులే, సందేహం లేదు. తప్పకుండ చెయ్యాల్సినవి కూడా. కాని ఇలాటివన్ని చేసేసి నావంతుగా నేను ప్రకృతి పట్ల బాధ్యతగా ఉంటున్నాను అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. కచ్చితంగా సరిపోదు. పైగా ఇలాంటివి మాత్రమే చేసి నేను బాధ్యతగానే ఉంటున్నాను అనుకోవటం మనల్ని మనం మోసం చేసుకోవటమే! ఎందుకంటే ఇలాంటివి అందరూ చేసే సమాజ సేవలాంటివి. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోకుండా, సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా, మన ఆత్మ సంతృప్తికోసం చేసే పైపై సహాయాలు ఇవన్నీ!

ఒక్క సారి ఆలోచించండి: పర్యావరణంలో ఇంతగా ఈరోజు సమతుల్యత లోపించింది అంటే అది అంతా మన జీవన విధానమే కదా? అసలు నిజంగా అన్నీ మనకి అవసరమైంతమేరకే ప్రకృతినుంచి తీసుకుంటున్నామా?







  • హంగు ఆర్భాటాలకోసం ఇంట్లో తెచ్చి పడేసుకున్న ఫర్నిచర్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అలా అందరి అవసరాలకోసం ఎన్ని అడవులు నరకాల్సి వస్తుందో ఆలోచన చేస్తున్నామా? ఆ మాత్రం స్పృహ లేకుండా ఎకో-టూరిజం పేరిట అడవుల్లో షికారుకు వెళ్ళటం ఎవరిని ఉద్దరించటానికి?



  • సైకిల్ మీద వారానికి ఒకసారి ఆఫిస్‌కి వెళ్తూ, మిగతా రోజుల్లో ఒక్కడే సొంత కార్‌లో తిరగటం ఎవరిని మోసం చెయ్యటానికి?



  • అవసరం అయినదానికి, కానిదానికి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎడా పెడా వాడేస్తూ, ఇంటిమీద సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే పర్యావరణ మిత్ర అయిపోతామా?



  • ఆకలి తీర్చుకోవటానికి కాక, రుచుల కోసం అన్ని రకాల ప్యాక్‌డ్ ఫూడ్ తెచ్చుకుని తింటూ, వాటి కవర్లు మాత్రం చక్కగా రీసైకిల్ చెయ్యటం బాధ్యతేనా?



  • షాపింగ్ పేరిట కంటికి నచ్చింది కొనిపడెయ్యటం తప్ప, అలా వినియోగ సంస్కృతి పెరగటం వల్ల ప్రకృతి వనరులు ఎంతగా కుంచించుకుపోతున్నాయో అని పట్టిందా మనకు?



  • మన మన ఇళ్ళళ్ళో వాననీటి సంరక్షణ గురించి పట్టించుకుంటున్నామా?



  • ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొంతమేరకైనా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే ఆలోచన ఏమైనా ఉందా?
ఇవన్నీ వినటానికి కటువుగా ఉండచ్చు, కానీ పచ్చి నిజాలు. మనం తెలుసుకోవాల్సిన, నమ్మి తీరాల్సిన నిజాలు. నిజాయితీగా మనం ప్రకృతిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోగలగాలి అంటే, అన్నిటికంటే ముందు మనం మన మన జీవన విధానాల్ని సమీక్షించుకోవాలి. ప్రతి రోజూ, పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేబోయే వరకు అసలు మనం ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నాం, అందులో ఎంత నిజంగా అవసరం, ఎంత అవకాశం అని ప్రశ్నించుకోవాలి. అంతవరకు "ఐ లవ్ నేచర్" లాంటి స్లోగన్‌లు మానుకుందాం!