Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Thursday, 8 March 2012

చెత్త పని - 4: అసలు సంగతి

ఇంతకు ముందు టపాల్లో చెప్పుకున్నట్లు అందరూ చక్కగా చెత్తని వేరుచెయ్యటం, కంపోస్టు చెయ్యటం అలవాటు చేసుకుంటే నిజంగా కొద్దికాలంలోనే చాలా మార్పుని చూడొచ్చు. చెయ్యటానికి కష్టం అనుకోవటానికి కూడా లేదు - కొన్ని పశ్చిమ యూరోప్ దేశాలలో ఇది చాలా మామూలు విషయం. అక్కడ ప్రతి మున్సిపాలిటీ దీన్ని ఖచ్చితంగా పాటించటం వల్ల అందరూ అలవాటు పడిపోయారు.

నిజానికి అక్కడ ఈ ఒక్క విషయంలోనేకాక చాలా విషయాలలో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్నా, సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నాసరే, చాలా మందిని అప్పుడప్పుడు ఆఫీస్‌కి సైకిల్ మీద రావటం చూస్తాము. అలాగే మనలా వారికి అంతగా ఎండ లేకపోయినా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించుకోవటానికి ప్రయత్నిచటంలాంటివి ఎన్నో మనం చూడొచ్చు.

మరి ఇక్కడ మనం చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఊరిచివర పోగుపడుతున్న ప్లాస్టిక్ కుప్పలని చూస్తూనే ఉన్నాం. మారుమూల గిరిజన పల్లెలలో కూడా టూరిస్టుల పుణ్యమా అని ప్లాస్టిక్ వాడటం పెరిగిపోయింది. వాడాక మామూలు చెత్తతో కలిపి పారెయ్యటం, చెత్త కుప్ప పెద్దదయ్యాక అప్పుడప్పుడు తగలబెట్టటం. అంతే.

పోల్చి చూసుకుంటే చాలా బాధగా ఉంది కదా? అవును అనిపిస్తే మీరు ఈ టపా చివరివరకు చదవాల్సిందే. కాదు అనిపిస్తే ప్రకృతి పట్ల నిజంగా బాధ్యత అంటే ఏమిటో మీరు తెలుసుకున్నట్లే :-)

గందరగోళంగాఉంది కదూ? కొంచెం వివరంగా చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌లో ఈ చివరి టపా ప్రత్యేకంగా వ్రాస్తున్నాను. ఓపిక చేసుకుని ఒకసారి మనసు పెట్టి చదవండి:

అసలు పర్యావరణ స్పృహ, ప్రకృతి పట్ల ప్రేమ, వగైరా వగైరా మాటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా? వీళ్ళందరూ ఎక్కువగా ఏమి చెప్తున్నారో ఒక్కసారి చూద్దామా? చెత్తను వేరు చెయ్యండి, చెట్లు పెంచండి, వన్యప్రాణులను ప్రేమించండి, అడవుల్లో టూర్‌కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాడకండి, బయో డిజిల్‌లాంటివి వాడండి, మూగ జంతువులను, పక్షులను వీలైనంతలో పోషించండి, గట్రా, గట్రా.

ఇవన్నీ మంచి పనులే, సందేహం లేదు. తప్పకుండ చెయ్యాల్సినవి కూడా. కాని ఇలాటివన్ని చేసేసి నావంతుగా నేను ప్రకృతి పట్ల బాధ్యతగా ఉంటున్నాను అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. కచ్చితంగా సరిపోదు. పైగా ఇలాంటివి మాత్రమే చేసి నేను బాధ్యతగానే ఉంటున్నాను అనుకోవటం మనల్ని మనం మోసం చేసుకోవటమే! ఎందుకంటే ఇలాంటివి అందరూ చేసే సమాజ సేవలాంటివి. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోకుండా, సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా, మన ఆత్మ సంతృప్తికోసం చేసే పైపై సహాయాలు ఇవన్నీ!

ఒక్క సారి ఆలోచించండి: పర్యావరణంలో ఇంతగా ఈరోజు సమతుల్యత లోపించింది అంటే అది అంతా మన జీవన విధానమే కదా? అసలు నిజంగా అన్నీ మనకి అవసరమైంతమేరకే ప్రకృతినుంచి తీసుకుంటున్నామా?







  • హంగు ఆర్భాటాలకోసం ఇంట్లో తెచ్చి పడేసుకున్న ఫర్నిచర్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అలా అందరి అవసరాలకోసం ఎన్ని అడవులు నరకాల్సి వస్తుందో ఆలోచన చేస్తున్నామా? ఆ మాత్రం స్పృహ లేకుండా ఎకో-టూరిజం పేరిట అడవుల్లో షికారుకు వెళ్ళటం ఎవరిని ఉద్దరించటానికి?



  • సైకిల్ మీద వారానికి ఒకసారి ఆఫిస్‌కి వెళ్తూ, మిగతా రోజుల్లో ఒక్కడే సొంత కార్‌లో తిరగటం ఎవరిని మోసం చెయ్యటానికి?



  • అవసరం అయినదానికి, కానిదానికి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎడా పెడా వాడేస్తూ, ఇంటిమీద సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే పర్యావరణ మిత్ర అయిపోతామా?



  • ఆకలి తీర్చుకోవటానికి కాక, రుచుల కోసం అన్ని రకాల ప్యాక్‌డ్ ఫూడ్ తెచ్చుకుని తింటూ, వాటి కవర్లు మాత్రం చక్కగా రీసైకిల్ చెయ్యటం బాధ్యతేనా?



  • షాపింగ్ పేరిట కంటికి నచ్చింది కొనిపడెయ్యటం తప్ప, అలా వినియోగ సంస్కృతి పెరగటం వల్ల ప్రకృతి వనరులు ఎంతగా కుంచించుకుపోతున్నాయో అని పట్టిందా మనకు?



  • మన మన ఇళ్ళళ్ళో వాననీటి సంరక్షణ గురించి పట్టించుకుంటున్నామా?



  • ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొంతమేరకైనా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే ఆలోచన ఏమైనా ఉందా?
ఇవన్నీ వినటానికి కటువుగా ఉండచ్చు, కానీ పచ్చి నిజాలు. మనం తెలుసుకోవాల్సిన, నమ్మి తీరాల్సిన నిజాలు. నిజాయితీగా మనం ప్రకృతిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోగలగాలి అంటే, అన్నిటికంటే ముందు మనం మన మన జీవన విధానాల్ని సమీక్షించుకోవాలి. ప్రతి రోజూ, పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేబోయే వరకు అసలు మనం ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నాం, అందులో ఎంత నిజంగా అవసరం, ఎంత అవకాశం అని ప్రశ్నించుకోవాలి. అంతవరకు "ఐ లవ్ నేచర్" లాంటి స్లోగన్‌లు మానుకుందాం!

Sunday, 27 November 2011

చెత్త పని - 3: ఇంట్లోనే కంపోస్టు తయారీ


ఇంతకుముందు టపాల్లో చెప్పుకున్నట్లు మన వంటింటి చెత్త నుంచి అతితేలికగా కంపోస్టు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

వివరాల్లోకి వెళ్ళేముందు తేలిగ్గా అవగాహన అవటానికి మనం ఇంతకుముందు అనుకున్న అరటి తొక్క గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆరుబయట పారేసిన అరటి తొక్క మనం చూస్తూ ఉండగానే కంపోస్టు అయ్యి భూమిలో కలిసిపోతుంది కదా! ఇక్కడ అసలు ఏం జరిగింది? ఎలా అరటి తొక్క అంత తేలిగ్గా ఎవరికీ శ్రమ ఇవ్వకుండా ఎలా కంపోస్టు అయ్యింది?? 

ఆరుబయట గాలిసోకుతున్న ఏ ఆహార పదార్థమైనా అందులోని సూక్ష్మ క్రిములవల్ల మెల్లగా కుళ్ళిపోయి నేలలో కలిసిపోతుంది. అంతే! ఇంతకంటే ఈ విషయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన/నేర్చుకోవాల్సిన బ్రహ్మ పదార్థమేమీ లేదు!!             

ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని మన వంటింట్లోకి ఎలా అన్వయించుకుందామో చూద్దాం. ఇందుకు మనం చెయ్యాల్సిందల్లా ...  

1. వంటింటి చెత్తని వేరుచెయ్యటం: వంటింట్లో మిగిలిన ఆహారాన్ని (కూరగాయముక్కలు, ఆకులు, మిగిలిపోయిన అన్నం, కూర వగైరా) మిగతా చెత్తతో కలపకుండా కంపోస్టుకోసం వేరుగా ఉంచటం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం క్రింద జల్లెడలా ఉన్న గిన్నె ఏదైనా వాడొచ్చు - అయితే ఈ గిన్నెని ఇంకొంచెం పెద్ద గిన్నెలో ఉంచి పెట్టుకోవాలి. ఎందుకో మీకీపాటికే అర్థం అయిఉంటుంది: పై గిన్నెలో ఒకవేళ ఎక్కువ నీరు ఉంటే అది మెల్లగా క్రింద గిన్నెలోకి దిగిపోతుంది. ఎక్కువ చెమ్మ ఉంటే కంపోస్టు త్వరగా కాదు మరి!  

2. ఎప్పటికప్పుడు:  ఇలా విడిగా పెట్టుకున్న గిన్నెని ఏ పూటకా పూట మన కంపోస్టు కుండలలోకి ఖాళీ  చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మనం కంపోస్టు చెయ్యబోతున్న వంటింటి చెత్తలో ఎంత ఇంకిపోయినా చెమ్మ ఎక్కువగానే ఉంటుంది. అందుకే దీన్ని మనం కంపోస్టు కుండలలో వేసేటప్పుడు తప్పకుండ పేపరు ముక్కలు లేదా ఎండు ఆకులు కలిపి వెయ్యాలి (బయట పారేసిన అరటి తొక్కకి ఈ సమస్యలేదు..కుండిలో కాకుండా ఆరు బయటే ఉంది కాబట్టి ఎంచక్కా గాలికి తడారిపోతుంది)

 3. ఇక అసలు సంగతి - కంపోస్టు కుండలగురించి.  ఇలా అనగానే ఇందుకోసం ఎదో ప్రత్యేకంగా తయారుచేసిన కుండలు గట్రా వాడాలేమో ఆనుకోకండి! మనకి కావాల్సిందల్లా ఒకదానిమీద ఒకటి పేర్చుకోవటానికి (ఇది కూడా కేవలం ఖాళీ ఆదా చేసుకోవటానికి, అలా కుదరకపోయినా ఇబ్బంది లేదు)  వీలుగా ఉన్న 3 కుండలు. అయితే వీటికి గాలి ఆడటానికి వీలుగా చుట్టూ చిన్న చిన్న బెజ్జాలు  మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఈ కుండలు ఒకదానిమీద ఒకటి పేర్చినప్పుడు ఇలా ఉంటాయి: 

ఇప్పుడు మనం వంటింటి చెత్తని మొదట పైనున్న కుండలో వెయ్యటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఇది నిండి పోతుందో, అప్పుడు దాన్ని క్రిందకి మార్చి రెండో కుండలో వెయ్యటం మొదలు పెట్టాలి. ఇలానే తర్వాత మూడో కుండలోకి.                

4. కలియపెట్టటం: ఇప్పుడు మనం అప్పుడప్పుడు (వారానికొక్కసారి) చెయ్యాల్సిన పని ఒకటుంది. ఎంతగా మనం బెజ్జాలు ఉన్న కుండల్లో ఉంచినా గాలి సరిగ్గా ఆడదు కాబట్టి అప్పుడప్పుడు కలియపెట్టాలి.అలా చేసేటప్పుడు వేలైతే వీపపొడి, పసుపు కలుపుకోవచ్చు.     

  
ఇంతేనా? ఇంతకీ మనం ఇందులో కంపోస్టు ఎక్కడ తయారుచేసాం??  

ఈ ప్రశ్నకి సమాధానం మీకు ప్రకృతే చెప్తుంది - ఎందుకంటే అసలు పని చేసింది ప్రకృతే కాబట్టి. మనం కేవలం అందుక్కావాల్సిన ముడి సరుకులు (చెత్త, గాలి) అందించాం. అంతే!!  

ఈ విషయం మీ అంతట మీరు తెలుసుకోవటానికి కొన్నాళ్ళు పోయాక మూడు కుండలు గమనించండి...     

మొదటి కుండలో అప్పుడప్పుడే వేస్తున్న వంటింటి చెత్త: 

రెండో కుండలో  దానంటతదే తయారవుతున్న కంపోస్టు:

ఇక మూడో కుండలో మనం మొక్కలకి వాడుకోవటానికి సిద్దంగా కంపోస్టు:  

తెలుసుకున్నారు కదా? తప్పకుండా మీమీ ఇళ్ళల్లో కంపోస్టు తయారు చెయ్యటం మొదలుపెడతారని ఆశిస్తాను. మీకు ఎమైనా సహాయం చెయ్యగలను అనుకుంతే తప్పకుండా నన్ను సంప్రదించండి! ఇంతకుముందు చెప్పినట్లు కంపోస్టు  చెయ్యటం మొదలు పెట్టాక  మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది    

ఇంకొక ముఖ్యమైన విషయం:  చెత్త సమస్యకి పరిష్కారం కేవలం ప్లాస్టిక్ వాడకం తగ్గించటం, చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చేసుకోవటమే కాదు. వీటన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన/మార్చుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటో వచ్చే టపాలో చెప్పుకుందాం! 

Sunday, 28 August 2011

చెత్త పని - 2 : మూలాల్లోకి...

చెత్తవల్ల సమస్యల గురించి తెలుసుకున్నాం. మరి వెంటనే కార్యాచరణ మొదలెట్టేద్దామా? ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, వేర్వేరు రకాల చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చెయ్యటం వగైరా వగైరా...

అలా ఎకాయెకిన లేడికి లేచిందే పరుగు అన్నట్టు పనిమొదలుపెట్టేస్తే, నాకుతెలిసి కేవలం రెండే రెండు నెలల్లో మనం తిరిగి ఇప్పటి అలవాట్లకే వెనక్కి వచ్చేస్తాం! ఎందుకంటే ఈ విషయంలో సరైన అవగాహన, దృక్పథం చాలా అవసరం. అవి లోపించబట్టే ఇన్నాళ్ళుగా మనం ఇలాంటి మార్పుకి అలవాటుపడలేకపోతున్నాం. కొంచెం వివరంగా చెప్పాలంటే...

ప్లాస్టిక్ వాడొద్దు అని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నామనుకోండి...రేపట్నుంచి చక్కగా పేపర్ సంచులు గట్రా మొదలుపెట్టేస్తాం. నిజమే..మనం తప్పకుండా ఆచరించాల్సిన విషయం ఇది - ప్రతి ఊరిచివర పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలను కళ్ళారా చూస్తునే ఉన్నాం కదా! కాని వంటింట్లో మిగిలినది, ఇంకా మిగతా చెత్త సంగతి?? దాన్నిమాత్రం చక్కగా చెత్తకుప్పలో పారేసి వస్తాం. ఈ మిగిలిన చెత్తని తీసుకెళ్లటానికి మున్సిపాలిటీ ట్రక్ ఎప్పటిలానే వస్తుంది. ఎప్పటిలానే అంతా తీసుకెళ్ళి ఊరిచివర పారేసి తగలబెట్టేస్తారు. అంటే ఈ విషయంలో మనకి సరైన అవగాహన లేక ఎలాగొలా వదిలించుకోవాలని చూస్తున్నట్లే కదా?

అసలు దేన్నైనా "చెత్త" అంటున్నామంటే అది పనికిరానిదని కాదు! దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏంచెయ్యాలో మనకి తెలియదని..అంతే! అలాంటప్పుడు లోపం మనది కాదా?

ఒక్కసారి మూలాల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం...

ఎప్పుడైనా ఆరుబయట పడి ఉన్న అరటి తొక్కనో, కూరగాయల ముక్కల్నో గమనించారా? ఒక రోజు, రెండు రోజులు, ఒక వారం కనిపిస్తాయి. తర్వాత? ఏమైపోయాయి?? మనం తీసికెళ్ళి ఎక్కడా పారెయ్యకుండానే, ఎక్కడా తగలబెట్టకుండానే వాటంతటవే నేలలో కలిసిపోలేదూ???

అమ్మ (ప్రకృతి) చెప్తున్న ఈ చిన్న విషయం అర్థం చేసుకోగలిగితే చాలు. మనం ఎక్కడ మొదలు పెట్టాలో తేలిగ్గా అర్థం అవుతుంది. మనం వాడే ప్రతి వస్తువునీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో తిరిగి అక్కడికి చేర్చటమే మనం చెయ్యాల్సిందల్లా! ఇంకా వివరంగా చెప్పాలంటే..

1. వంటింటి చెత్త: పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ నేలనుంచి కదా మనకి వచ్చేది? అందుకని ఈ చెత్తని తిరిగి నేలకే ఎరువుగా అందజెయ్యాలి (ఇది ఎంత తేలిగ్గా ఇంట్లోనే చెయ్యొచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం)

2. ప్లాస్టిక్: తప్పని సరై ప్లాస్టిక్ లాంటివి వాడుతున్నప్పుడు వాటిని తిరిగి రీసైకిల్ చేసే సంస్థలకి పంపించొచ్చు. ఎందుకంటే వీటిని అలా విసిరి పడేస్తే నేలలో కలిసిపోవు; తగలబెట్టనూకూడదు (ఈ విషయం ఇప్పటికీ చాలమందికి తెలియదు)

3. ఇనుము, మెటల్ గట్రా: వీటిని మిగతా వాటితో కలపకుండా, రీసైకిల్ చేసే సంస్థలకి పంపడమే

4. హానికరమైన చెత్త: ఎలక్ట్రానిక్, మెడికల్ లాంటివన్న మాట. మిగతా వాటికంటే కొంచెం కష్టం. ఎలక్ట్రానిక్ చెత్తని కూడ రీసైకిల్ చేసే సంస్థలు ఉన్నాయి. మెడికల్‌కి మాత్రం హాస్పిటల్స్ దగ్గర కనుక్కోవాల్సిందే

"పోద్దురూ...ఇంత వివరంగా చెత్తని వేరు చేసి ఏది ఎక్కడ ఇవ్వాలో కనుక్కుని మరీ చెయ్యాలా? అయ్యే పని కాదు!" అని అనేసుకుంటున్నారా?? అనుభవంతో చెప్తున్నాను..చాలా తేలిక పని. పోనీ ఇంకా తేలిగ్గా మొదలెడదామా??

ముందుగా వంటింటి చెత్త మాత్రం వేరుచెయ్యండి. ఇది మాత్రం బయట పడెయ్యకుండా కంపోస్టు చేద్దాం. ఎంచక్కా మన కుండీల్లో మొక్కలకే ఎరువుగా వాడుకోవచ్చు! ఇది అనుభవంలోకి వచ్చాక మిగతావి మొదలుపెడుదురు కాని. ఎందుకంటే, ప్రకృతి ఎంత తేలిగ్గా వంటింటి చెత్తని ఎరువుగా మార్చుకుని తనలో కలుపుకుంటుందో ఒకసారి మీ కళ్ళతో మీరే చూసాక, అసలు చెత్త గురించి మీకిప్పటిదాకా ఉన్న దృక్పథమే మారిపోతుంది! ఈ మార్పు గురించే టపా మొదట్లో చెప్పింది. ఇంకో విషయం...కేవలం ఇలా కంపోస్టు చెయ్యటం వల్లే మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది

ఇలా ఉభయతారకంగా కంపోస్టును ఇంట్లోనే అతి సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం...

Wednesday, 10 August 2011

చెత్త పని - 1

అద్దె ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఏజంట్‌ని విసిగించి, వడపోసి తిరగ్గా తిరగ్గా దొరికిందో చక్కటి ఇల్లు, అందులోని పై పోర్షను. కన్నడ రాజకీయాలు, కుంబ్లే రిటైర్మెంటు, బెంగళూరు పుట్టుపూర్వోత్తరాలూ ఇంటి ఓనరుతో తీరిగ్గా చర్చించాక, ఉభయతారకంగా వ్యవహారం తెముల్చుకుని వస్తుండగా కనిపించింది....ఇంటి పక్కనే ఓ పెద్ద చెత్త కుప్ప!

పక్క స్థలం ఎప్పటినుంచో ఖాళీగా ఉండటం వల్ల జాలిపడి మున్సిపాలిటీ వాళ్ళే దాన్ని అనధికారంగా ఆ ఏరియా చెత్తకి డంపింగ్ యార్డుగా డిక్లేర్ చేసేసార్ట. ఇంకేం....విషయం దాచిపెట్టినందుకు ఏజంట్‌ని చివాట్లు పెట్టటం, ఓనర్‌కి ఇంకొన్ని కబుర్లు చెప్పి అడ్వాన్స్ వెనక్కి తీసుకోవటం, చక చకా జరిగిపోయాయి. కాదా మరి! దరిద్రపు చెత్త కుప్పని మరీ పక్కనే పెట్టుకుని ఎవరుంటారాఇంట్లో!!

కాలక్రమంలో ఇంకొందరు ఏజంట్లూ, ఇంకొన్ని అద్దె ఇళ్ళూ (మళ్ళీ ఎక్కడా చెత్త బారిన పడకుండా) మారాక ఓ శుభ ముహుర్తంలో సొంత ఇంట్లో గృహప్రవేశం కూడా చేశాము. పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కాబట్టి ఏ పూటకాపూటా ఇంటి నుంచే చెత్త తీసికెళ్ళటం, ఏ రోజుకారోజు ట్రక్‌లో బయటకు తోలించటంలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ప్రాణానికి హాయిగా రోజులు గడిచిపోతుండగా...

ఓ శుభోదయాన వ్యాహాళిలో పరిశుభ్రమైన పరిసరాలను ఆస్వాదిస్తున్న సమయంలో మొదలైంది ఒక చిన్న ఆలోచన. ఇంతకాలం చెత్త అని అసహ్యించుకుంటున్నది, నా బోటి వాళ్ళు అందరూ ఎవరికి వారే తమ ఇళ్ళు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని ఊరిమీదకి వదిలేసిందే కదా!

ఈ చెత్త అంతా ఎక్కడికి వెళ్తుందో, దాన్ని తగలబెట్టటం వల్ల ఎంత అనర్ధాలు ఉంటాయో మనకి పట్టదా?

వంటింట్లో మిగిలిన తిండి, ప్లాస్టిక్, ఇంకా నానా రకాల చెత్త, ఇలా ఒకదానికొకటి పొసగనివన్నీ కలిపి కట్టకట్టి చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో పడేసి మన బాధ్యత అయిపోయిందనుకోవటమేనా?

ఈ చెత్త కుప్పల్లో తిండి కోసం వచ్చిన మూగజీవాలు, ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తినలేక అలాగే వాటిని కూడా మింగి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నా మనకి పట్టదా?

అసలు ఇన్ని వేల సంవత్సరాలనుంచి లేని ఈ చెత్త సమస్య ఇప్పుడిప్పుడే మనల్ని ఎందుకు పీడిస్తుంది?

ఎందుకు పల్లెటూర్లలో కూడా ఊరి చివర్లలో ప్లాస్టిక్ చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయి?

ఇంతగా అడాన్స్ అయ్యాం అని చెప్పుకుంటున్న మనం ఇంతకుముందెన్నడూలేని ఈ సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది పురోగమనమా?

పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని ఆర్భాటాలకి పోయి వాటి గుర్తుగా మనం ఏం మిగులుస్తున్నాం? మన సంతోషాలు, గొప్పలు తప్ప మనకంటూ బాధ్యత లేదా?

అవసరం ఉన్నంతవరకు వాడుకోవటం ముందుచూపు; అవకాశం ఉందికదా అని వాడుకోవటం నిర్లక్ష్యం. ఈ చిన్న తేడా తెలియకపోవటమే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం

అసలు ప్రకృతిలో చెత్త అనే మాటకే అర్థం లేదు! ఒక చోట ఒక రూపంలో వాడుకోగా మిగిలినవి వేరొక చోట వేరొక రూపంలో వాడుకోవటం తప్ప . ఇది తెలుసుకోవటానికి పశువులమీద ఆధారపడ్డ మన సంప్రదాయ వ్యవసాయం / పల్లె జీవనాన్ని గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది

ఈ చిన్న క్లూ చాలు. ఇక్కడే మొదలెడదాం. తిరిగివ్వటం నేర్చుకుందాం! మన ఇంట్లో, మన చేతులతో 'చెత్త పని' మొదలెడదాం !!

Sunday, 19 June 2011

ముసుగు

కొన్నాళ్ళ క్రిందటి ఒక సాదా సీదా ఘటన..

దేశంకాని దేశంలో ఓ శుభోదయాన ఆఫీస్‌కి వెళ్ళటానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తూ, దారెంబడి వచ్చిపోయే కార్లనీ, దారి పక్కన విచ్చుకున్న గడ్డి పూలనీ, తేట తెలుగులాంటి ఆకాశాన్ని చూస్తూ, ఆలోచిస్తూ ఉండగా...

ఎదురుగా ఓ పెద్దాయన..మొహమాటం లేకుండా తిన్నగా నా దగ్గరకి వచ్చేసి, చుట్టూ ఉన్న చెట్లనీ, ఎగురుతున్న పిట్టలనీ నాకు చూపిస్తూ ఏదో చెప్పటం మొదలెట్టారు..

జర్మన్ భాషలో అక్షరాలు, అంకెలు తప్ప పై తరగతులు చదువుకోని నాకు ఆయన చూపించేవి కనబడటం తప్ప, చెప్పేది ఒక్క ముక్కా అర్థం కాలేదు; అర్థం కాలేదు పాపం అని ఆయన కూడా పెద్దగా జాలి చూపించలేదు! ఈ సారి నీలాకాశం, ఋతువులు అలా అలా సాగింది వాక్ప్రవాహం ...

ఆ ప్రవాహం అలా ఆయన అత్త మామలగురించి, చిన్నప్పటి సంగతుల గురించి, రెండో ప్రపంచ యుద్దం గురించీ, ఇలా మరెన్నో పాయలను కలుపుకుని స్వరరాగ గంగా ప్రవాహంలా మారుతుండగా, నాకు ఓ విషయం స్ఫురించింది. ఆయన మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కాక పోయినా, చెప్పే విషయం మాత్రం అర్థం అవుతుంది నాకు..స్పష్టంగా! అంతే కాదు, ఆయన చెప్పేది నాకు సోదిలా అనిపించటం లేదు. ప్రతి మాటా మనసు పెట్టి వింటున్నాను..ఏదో మొహమాటనికి నటించకుండా. ప్రతిస్పందిస్తూ.

ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఒక మతం కాదు, ఒక వయసు కాదు. ఏదీ సరి పోలదని ఆయనికీ తెలుసు. అయినా నాతో మాట్లాడాలని, నాకు అర్థం కాకపోయినా నాకు ఎదో చెప్పాలని ఆయనికి ఎందుకు అనిపించింది??

స్థూలంగా చూస్తే ఇది అంతగా పట్టించుకోవలసినవసరం లేని ఒక సాదా సీదా ఘటనే - ఉబుసుపోక ఓ పెద్ద మనిషి చెప్పిన కబుర్లు. కాని నిజంగా ఇందులో ఎమీ లేదా?

మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నిజాయితీగా మనసులో భావం పంచుకోవటానికి అసలు నిజంగా భాషతో అవసరం ఉందా? ఇలా మనసుతో మాట్లాడే అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఆ అవకాశం మనం కల్పించుకుంటున్నామా?

అసలు ఇలా మనం సాటి మనిషితో మాట్లాడి ఎన్నాళ్లయింది - మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకుని, మొహమాటలు, భేషజాలు లేకుండా? నోరు తెరిచి ఒక మాట చెప్పుకోవటానికి ఎన్నో వడపోతలు. అంతకు ముందు మనలోపలి మనిషి మీద కప్పుకున్న ఎన్నో ముసుగులు!

మార్చుకోవటానికీ, నేర్చుకోవటానికీ జీవితంలో అనూహ్యమైన మలుపులు, అపూర్వమైన మనుషులే తారసపడనవసరం లేదు. అర్థం చేసుకునే హృదయం, స్పందించే మనసు ఉంటే మనకు ఎదురై ప్రతిఘటనా, ప్రతిమనిషి, నేర్పించే గురువులే కదా!

Wednesday, 18 May 2011

నా చిన్నారి నేస్తాలు...

నా చిన్నారి నేస్తాల గురించి ఇప్పటి వరకు మీకు పరిచయం చెయ్యలేదు కదూ??

అవి నాకు ఆరోతరగతి నుంచి పరిచయం. అప్పుడు మాకు తెలుగులో వాటి గురించి కవిత ఉండేది..ఎవరు వ్రాసారో గుర్తు లేదు, కవిత కూడా గుర్తులేదు కానీ, నేస్తాలు ఇప్పటికీ ఉన్నాయి.

ఇక్కడ కూడా ఉన్నాయి..అవును, ఇక్కడ నేను రోజూ నడచి వెళ్ళేదారిలో కనిపిస్తాయి. చిట్టి చిట్టి నవ్వులతో తమని ఎవరైనా పలకరిస్తారేమో అని రోజూ ఆశగా ఎదురు చూస్తుంటాయి. దారిన పోయే ప్రతి వారినీ కుశలమడుగుతాయి. కానీ పాపం వాటిని ఎవరూ అసలు పట్టించుకోరు. ఇంకొందరైతే నిర్దాక్షిణ్యంగా వాటిని .... :-(

పాపం నేను దూరం నుంచి పలకరించగానే ఎంత సంతోషమో వాటికి..చిన్న పాటి స్పర్శకే ఎంత సంబరమో వాటికి! ఆ స్పర్శ కోసమే ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నట్లు! కాదా మరి.. మూణ్ణాళ్ళ ఆయువే ఇచ్చాడు వాటికా దేవుడు. ఆ ముణ్ణాళ్ళల్లోనే క్షణ క్షణ గండం!

ఇకనుంచైనా మనం ఈ చిట్టి నేస్తాలని అప్యాయంగా పలకరిద్దామా? అసలు మన సొమ్మేం పోతుంది నోరు తెరిచి "బావున్నావా?" అని వాటిని ఓ మాట అడిగితే? అడుగుతారు కదూ??

ఓ..ఇంతకీ ఈ నేస్తాలెవరో చెప్పనేలేదు కదూ.. ఈసారి నడిచి వెళ్ళేటప్పుడు కొంచెం తలదించి చుట్టూపక్కల వెతకండి కనిపిస్తాయి..

గడ్డి పూలు!!

అవును...పూజకీ, అలంకారానికీ పనికి రాని చిన్నపాటి గడ్డి పూలు. చూడగలిగే మనసు ఉంటే అవెంత అపురూపమో తెలుస్తుంది. వినగలిగే మనసు ఉంటే రోజూ అవి మనకి చెప్పుకునే ఊసులూ అర్థమౌతాయి. అలా తెలుసుకొని, అర్థం చేసుకొన్న నాడు తలదించుకునే నడుస్తాం మనం!

Friday, 13 May 2011

అబ్బాయి మంచోడేనా??

"అబ్బాయి మంచోడేనారా? నిదానమే కదా?"

"ఆ..ఆ..చాలా నిదానం బాబాయ్!"

"ఎమీ లేద్రా, చాలా దూరమైనా పిల్లాడు బుద్ధిమంతుడని ఖాయం చేసుకుందామనుకుంటున్నాం. నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావాయె"

"కాకపోతే.."

"కాకపోతే?? చిన్న చిన్న అలవాట్లు ఏమైనా ఉన్నాయా? బాగా తెలిసిన వాడన్నావ్ గా? "

"అబ్బే, అలాంటివేం లేవు బాబాయ్!"

"మరి?"

"ఏమీ లేదు..తన పనేంటో తను చూసుకుపోయే రకం. ఏమీ పట్టనట్లుంటాడు"

"అంటే మనమ్మాయిని బాగా చూసుకోడంటావా?"

"అబ్బే అదేం లేదు బాబాయ్..తనకి ఫ్యామిలీ అంటే చాలా బాధ్యత. చూస్తున్నానుగా, వాళ్ళ అమ్మగారిని ఎంత బాగా చూసుకుంటున్నాడో"

"మరికేంట్రా?? దేనికీ వంక పెట్టటానికి లేదుగా?"

"దేనికీ పూనుకుని ముందుకు రాడు బాబాయ్! చాలా సార్లు చూశాను. అదేమంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టటం ఎందుకు అంటాడు. మొన్నా మధ్య రోడ్డు గురించి వెళ్ళి కౌన్సిలర్ ని గట్టిగా అడిగివద్దామంటే మనకెందుకొచ్చిన గొడవ అన్నాడు! అసలు మొదట్నుంచీ వోటెయ్యటానికి కూడా ఎప్పుడూ రాలేదు. అంతకు ముందోసారి రోటరీవాళ్ళు ఇక్కడ చెరువు శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెడితే రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఇలాంటి వాటికి మాత్రం రాడు కాని, గురువారం గురువారం ఆఫీస్ కి లేట్ అయినా సరే బాబా గుడికి వెళ్ళి కనీసం గంటసేపైనా కూర్చుని వస్తాడు "

"ఏరా..ఇక ఆపుతావా నీ సొద? పెళ్ళి సంబంధం చూస్తున్నావా లేక ఇకేమైనానా?"

"అంటే..నువ్వు మంచోడేనా అని అడిగావ్ కదాని.."

"అయితే? కుర్రాడు పిల్లని బాగా చూసుకోగలడు. పెద్దాళ్ళన్నా, దేవుడన్నా, భయం భక్తి ఉన్నాయ్. బయటి విషయాల్లో తలదూర్చకపోతే మంచిదే అనుకోవాలి కానీ, అదో పెద్ద పాపమన్నట్లు చెబుతున్నావే!"

" "(మరలా అయితే మంచోడేనా అని అడగటం దేనికి?)

బాధ్యతారాహిత్యంతో కూడిన పిరికితనానికి, మంచితనమని ముసుగు వేసుకుంటున్నామా?

Wednesday, 6 April 2011

ఒక్క పూట భోజనం మానలేమా??

72 ఏళ్ళ పెద్దాయన మన భవిష్యత్తు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే, మనం మన కోసం ఒక్క పూట భోజనం మాని మద్దతుగా ఉండలేమా? ఇది మన సమస్య, మన బాధ్యత కాదా?

ఇళ్ళళ్ళో తిని పారేసిన తిండి తిని వీధిలో పడుకునే కుక్కలు కూడా తమ బాధ్యతగా కొత్త వాళ్ళు వస్తే మొరుగుతాయే...మరి మన సమాజం గురించి మనకి ఆ మాత్రం బాధ్యత లేదా?

ఆలోచించండి...ఎవరో ఏదో చేస్తారని ఎవరమూ ఏమీ చెయ్యకుండా ఉందామా??

Tuesday, 20 May 2008

ఆ రోజుల్లో ....

(బాల్య స్మృతులను నెమరు వేసే కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు. టపా యొక్క అసలు ఉద్దేశ్యం వేరు)

పోయిన వారమే అంగీరసనామ సంవత్సరానికి సాదరంగా రెండోసారి ఆహ్వానం పలికాను.

మనవడికి వేసవి సెలవులు కావటంతో గడుగ్గాయితో ముచ్చట్లు పెట్టుకోవటానికి కొంత వీలు చిక్కింది. ఎప్పుడైనా ఇలా అవకాశం దొరికితే తన బళ్ళో సంగతులు చెప్పి విసిగించటం వాడి అలవాటు.ఈ సారి వాడికా ఛాన్సు ఇవ్వకూడదని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నాను. ఆ ప్రకారంగా పథక రచన కూడా చేసేసుకున్నాను.

అలా అని కష్టపడి కొత్తగా ఏమీ ఆలోచించలేదులెండి. అందరు తాతయ్యలలానే నేను కూడ నా మనవడితో నా బాల్యస్మృతులు పంచుకునే కార్యక్రమం పెట్టుకున్నాను.

"రేయ్ కన్నా, నా చిన్నప్పుడు..." అంటూ మొదలు పెట్టి ఆనాటి జ్ఞాపకాల్ని ఒక్కొక్కటీ పంచుకోవటం మొదలెట్టాను. మొదట్లో అంతగా ఆసక్తి చూపనివాడు కాస్తా నేను ఆ రోజుల్లో మేము ఎంత స్వేచ్ఛగా జీవించేవాళ్ళం, ఈ రోజుల్లో అతిపరిమితంగా/అరుదుగా లభించేవన్నీ ఆ రోజుల్లో మేము ఎంతగా మనసారా ఆస్వాదించేవాళ్ళం అంటూ చెప్తుండేసరికి బుద్దిగా ఆలకించసాగాడు.

"నీకో సంగతి తెలుసా? నా చిన్నప్పుడు నీళ్ళకి కొదవే ఉండేది కాదు. ఏటి పక్క ఊరు కదా, 30/40 అడుగులలోనే తియ్యటి మంచి నీళ్ళు పడేవి! అంత పెద్ద ఇల్లు శుభ్రం చెయ్యటం, వాకిలి అంతా రోజూ కల్లాపి చల్లటం, అంతా మంచి నీటితోనే. ఇల్లళ్ళోనేకాక వీధికొక పంపు ఉండేది. కొలతలు పెట్టుకుని వాడటం, గుంటలు తవ్వి వాన నీళ్ళు దాచిపెట్టుకోవటం ఇలాంటివన్నీ కనీ వినీ ఎరగం మేము!"

ప్రస్తుత పరిస్థితితో బేరీజు వేసుకున్నాడు కాబోలు, బుజ్జిగాడి మోములో ఆశ్చర్యంతో కూడిన చిన్నపాటి అసూయ....

ఆ మాత్రం చోదనం చాలు నాకు, మరిన్ని విశేషాలు వివరించటానికి సిద్దపడి పోయాను..

"అప్పట్లో ఫలానా చైనా దేశంలో ప్రభుత్వం ఒకరికంటే ఎక్కువ పిల్లల్ని కనొద్దని రూల్సు పెట్టేదని విడ్డురంగా చెప్పుకునే వాళ్ళం. ప్చ్....ఇప్పుడు మీకాలంలో ఇలాంటివి మన దేశంలో కూడా చూడబోతున్నామని ఎన్నడూ ఊహించలేదురా! ఏ పండగకో పబ్బానికో తప్ప ఎన్నడూ బంధువులే కనపడటం లేదు! నా చిన్నప్పుడు ఏ ఇల్లు చూసినా ఎప్పుడూ సందడి సందడిగా కళకళలాడుతూ ఉండేవి. ఏ పిల్లవాడిని తీసుకున్నా కనీసం 3/4 బాబాయ్‌లు, అత్తమ్మలు....ఇంట్లో ప్రతి రోజూ పండగ రోజులానే ఉండేది"

'చిన్నపాటి ' అసూయకాస్తా కొంచెం పెరిగి పెద్దదయ్యింది. అందుకు అనుగుణంగా నా జోరూ కూడా పెరిగింది....

"చెప్తే నమ్మవుకాన్రా, అప్పట్లో ఇలా చెట్టు చెట్టుని లెక్క పెట్టుకుని కాపాడుకోవటం, ప్రతి సంవత్సరం ఇన్ని చెట్లు నాటాలి అని కార్యక్రమాలు పెట్టుకోవటం మాకు తెలియవు. ఊర్లోకానీ బస్తీలోకానీ ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు కళకళలాడుతుండేవి. "ఒక చెట్టు నరికితే రెండు చెట్లు నాటాలి" లాంటి రూల్సూ చెత్తా ఏమీ అవసరం ఉండేవికాదు. లెక్కకు మిక్కిలి చెట్లు ఉండేవిమరి!"

అప్పటిదాకా లీనమైపోయి వింటున్న వాడు ఇక ఎదో అడగాలని నోరు తెరిచాడు. బహుశా అలనాటి మధురస్మృతులనుంచి మరేదైనా విశేషం తెలుసుకోవాలనేమో. "ఏంటి చెప్పు" అన్నట్లు కళ్ళెగరేసాను, కించిత్ గర్వంతో...

"మీరందరూ ఆ రోజుల్లో అంతలా జల్సా చెయ్యకుండా జాగ్రత్తపడి ఉంటే, మాకిప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదుకదా తాతయ్యా?"

Thursday, 8 May 2008

సమాజసేవ ఎంతవరకు సమంజసం?

తప్పా-ఒప్పా అన్నది కాదు నా ప్రశ్న.ఎంతవరకు సమంజసం అని మాత్రమే.రెండు ప్రశ్నలూ ఒకటే అంటారా? అలా అయితే కొంచెం ఓపిగ్గా చదవండి మరి ....

మొదటగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను "సమాజ సేవ" అని ఉద్దేశించి అంటున్నది మనకు మామూలుగా తెలిసిన సేవా కార్యక్రమాల గురించి.అంటే పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించటం, వైద్యసేవ, ఊరిని బాగుచెయ్యటంవంటి వాటి గురించి మాత్రమే. ఇలాంటివికాక ఇంకేం ఉంటాయి అంటారా? కాస్త ఆగండి మరి....ఆ విషయం గురించే ఈ టపా వ్రాస్తున్నది.

సమాజానికి ఏదైనా చేద్దాం అనే తపన ఉన్నవాళ్ళు మామూలుగా ఎంచుకునే మార్గం - తమ తమ ప్రాధామ్యాలని బట్టి పైన ఉదహరించిన, లేదా అలాంటి వేరే కార్యక్రమాలని ఎంచుకోవటం, ధనరూపేణో/కార్యరూపేణో శాయశక్తులా సహాయం చెయ్యటం. అంతా బావుంది కానీ, "అసలు ఇలాంటి అవసరం సమాజానికి ఎందుకు ఏర్పడుతుంది?" అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం..


"సమాజ సేవ" అనగానే మీ మదికి తట్టిన ఏ ఆలోచననైనా తీసుకోండి. మీ సహాయం పొందాల్సిన స్థితి లో సమాజం ఉండటానికి కారణాలేమిటి? కారణాలేవైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత, లేక అసలు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సమాధానం ఈపాటికే మీకు తట్టి ఉండాలి...అవును, ఆ బాధ్యత మనం ఎన్నుకున్న ప్రభుత్వానిది కాదా? మరి అలా ప్రభుత్వాలు ఎందుకు చెయ్యటం లేదు? కొన్ని కారణాలు...

(1) చెయ్యలేకనా? కావొచ్చు...ఆదాయ వనరులు, లేక ఇతర వనరుల కొరత వల్ల ఇలా కావొచ్చు. కానీ ఇలా కొన్ని విషయాలలో మాత్రమే..బహు కొద్ది విషయాలలో. మనది ధనికదేశం కాకపోవచ్చు, కానీ కనీస సదుపాయాలు సమకూర్చుకోలేనంతటి పేదదేశం మాత్రం కాదు. అదీకాక మనం "వనరుల కొరత" అని చెప్పుకొనేది నిజానికి చాలావరకు వనరులని సరిగా వినియోగించుకోలేకపోవటం (ఉదాహరణకి అనవసరమైన ఆర్భాటాలకి నిధులు మళ్ళించటం) వల్ల ఏర్పడే "కృత్రిమ" కొరత. మరి అలాంటప్పుడు ఇది అసమర్ధత కాదా?

(2) అవగాహనా లోపం వల్ల కూడ ఇలాంటి పరిస్థితి దాపురించవచ్చు. పర్యావరణానికి సంబంధించిన సమస్యలన్నీ చాలావరకు ఈ కోవలోకే వస్తాయి. ఈ విషయంలో ఎవరికీ దురుద్దేశ్యం లేకపోయినా కేవలం అవగాహనారాహిత్యం వల్ల మనం చేసే చేటు అంతాఇంతా కాదు.

(3) నిర్లక్ష్యం: ఇదికూడా ఒకరకంగా సరైన అవగాహన లేకపోవటం వల్లనే. మారుతున్న జీవన శైలి, భాష/సంస్కృతుల పట్ల నిర్లక్ష్యం ఇలాంటివన్నీ. ఈ నిర్లక్ష్యం వ్యక్తిగతం కావొచ్చు, లేక ప్రభుత్వపరంగా కొన్ని సందర్భాలలో ఉండే నిర్లక్ష్యం కావొచ్చు.

(4) అవినీతి వగైరా: విపులీకరించనవసరం లేదనుకుంటాను.

సరే. కారణాలు కొంతవరకు గుర్తించాం. ఇప్పుడు మళ్ళీ అసలు విషయంలోకి వద్దాం....

మీరు మీ సొంత ఊరిలో ఆసుపత్రి కట్టించి సేవ చేయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ సరైన వైద్యం లేక జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచిదే. మరి ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సంగతేమిటి? ఆ ఆసుపత్రి ఎందుకు సరిగ్గా పనిచెయ్యటం లేదు? పైన చెప్పిన 4 కారణల వల్ల కాదా? అలాంటప్పుడు మనం సొంత నిధులు ఖర్చుపెట్టి ఒక ఆసుపత్రి కట్టించటం సమంజసమా, లేక మన నిధుల్ని దుర్వినియోగించటాన్ని అరికట్టటం సమంజసమా?

మీరనొచ్చు...వ్యవస్థని చక్కదిద్దటానికి ఎంతో సమయమూ, శ్రమా కావాలి. అప్పటివరకు జనాల బాధని పట్టించుకోకుండా ఉండాలా అని. అలా అని నేననటంలేదు. చెయ్యగలిగినంత సాయం చేయ్యండి...ఆసుపత్రులు కట్టించండి, పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించండి, మరేదైనా చెయ్యండి. కాని చేసేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి - ఇవన్నీ చెయ్యవలసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అని. మీరు ఇలా కేవలం "ఇలాంటి" సమాజ సేవ చేసేవరకు వాళ్ళలా తప్పించుకు తిరుగుతూనే ఉంటారు అని. ఎందుకంటే వాళ్ళ పని చెయ్యటానికి మీరు ఉన్నారు కదా! నేను చెప్పొచ్చేది ఒక్కటే -మీరు చెయ్యాలనుకున్న సాయం చెయ్యండి, కాని అదే సమయంలో అసలు సమస్య గురించి కూడ కొంచెం ఆలోచించండి.

ఈ రోజు దేశంలో కొన్ని వేల సంఖ్యలో స్వచ్చంద సేవా సంస్థలు ఉన్నాయి. కొన్ని కోట్ల విరాళాలు పోగవుతున్నాయి. ఎన్నోరకాల సామాజిక సేవ జరుగుతోంది. మరి అన్ని సమస్యలకు పెద్దమ్మలాంటి రాజకీయాలను, పాలనా వ్యవస్థను చక్కదిద్దటానికి ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఎందరు విరాళాలు ఇస్తున్నారు? "సామాజిక" సేవకి మనమందరం, అన్ని స్వచ్చంద సంస్థలు కలిపి చెస్తున్న కృషిలో కొంత శాతమైన ఇందుకు వెచ్చిస్తే ఫలితాలు ఎలాఉంటాయో ఊహించుకోండి.

సాయం చేస్తున్నామా, లేక మళ్ళీ మళ్ళీ సాయం అడిగే పరిస్థితి కల్పిస్తున్నామా??

Tuesday, 8 April 2008

లేక్ వ్యూ అపార్టుమెంటు - హిల్ వ్యూ రిసార్టు

గమనిక: టపా మొదలు చూసి ఇదేదో పిల్ల రచయిత ప్రకౄతి వర్ణనకు చేసే ప్రయత్నమో, లేక నా సొంత బాకానో అనుకునేరు సుమా :-) ఓపికుంటే చివరివరకు చదవండి.

ఈ మధ్యే బెంగుళూరు శివార్లలో నా కష్టార్జితంతో - అంటే ఆర్జించినది, మరియు ఆర్జింపబోవునది(హోమ్ లోన్) అని చెప్పుకోవాలి - కొన్న అపార్టుమెంటులోకి గౄహప్రవేశం చేశాము. బుక్ చేసిన టైంలో బిల్డరు ఊదరగొట్టిన హంగులతోపాటు మా ఈ అపార్టుమెంటుయొక్క అదనపు ఆకర్షణ లేక్ వ్యూ అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.శివారుప్రాంతం అని చెప్పాను కదా, చుట్టుపక్కల ఇంకా ఏమీ ఇళ్ళు లేవు...బాల్కనీలోనుంచి మూడు దిక్కులా కనుచూపుమేర పచ్చదనమే. ఏపుగా పెరిగిన కొబ్బరి తోటలు, వరి చేలు, ఈ పచ్చదనం మధ్య జలకళతో ఉట్టిపడుతున్న నిండైన చెరువు! నీరెండలో ఈ సౌందర్యాన్ని కళ్ళారా చూడాలే తప్ప వర్ణింపనలవి కాదు!

మొన్నా మధ్య కేరళలోని మున్నార్ కి విహార యాత్రకని వెళ్ళాను. అసలే ప్రకౄతి ప్రేమికుడిని కదా...రెండు నెలలు శోధించి, టూర్ ఆపరేటర్లను వేధించి, అద్భుతమైన రిసార్టుని బుక్ చేశాను. నిజం చెప్పొద్దూ..వెళ్ళి చూసాక నా సెలెక్షన్ని నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను! ఈ మధ్యే కట్టిన రిసార్టు అది...కొండ కొమ్మున ఉంది, కేవలం పచ్చరంగునే వాడి సౄజించిన ఓ అద్భుతమైన పెయింటింగ్ లా ఉంది ఆ పరిసర వీక్షణం! పనిగట్టుకు చూసినా ఎక్కడా జనావాసాలే అగుపించవు మరి! అనుక్షణం ఆనందానుభవం ఆ యాత్ర..

******************************************

మా అపార్టుమెంటుకి పదేళ్ళునిండాయి. మొన్నీమధ్యే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాం. కాని ఇప్పుడు అపార్టుమెంటు గురించి చెప్పుకోవటానికి ఆకర్షణ అంటూ ఏమీ లేదు. ఇప్పుడది శివారుప్రాంతం కాదు, నగరంలో పేరొందిన ఓ కాలనీ. బాల్కనీ లో కూర్చుని ఆస్వాదించటానికి చుట్టూ పచ్చని చేలు ఏమీ లేవు...పిచ్చుకగూళ్ళలాంటి బిల్డింగులు తప్ప. ఇప్పుడా చెరువు ఉందోలేదో కూడ తెలియదు...ఆ వ్యూ కి అడ్డంగా బిల్డింగులు వచ్చి చాలాకాలం అయ్యింది. చుట్టు పక్కల బోర్లు ఎక్కువై, నీళ్ళు చేరే దారులు కూడా మూసుకుపోయి, ఇప్పుడందులో నీళ్ళు కూడా అడుగంటాయని అంటున్నారు :-(

ఆ కేరళ రిసార్టుకి కూడా పదేళ్ళు నిండాయి. ఈ మధ్యే మా కొలీగ్ వెళ్ళివచ్చాడు. అక్కడ కూడా అదే పరిస్థితట. టూరిస్టులు బాగా పెరగటంతో రిసార్టులూ ఎక్కూవయ్యాయి, ఊరూపెరిగింది, చుట్టూరా కాంక్రీట్ జంగిల్ తప్ప కొండాకోనలున్న ఆనవాళ్ళు ఎమీ లేవని అన్నాడు. పదేళ్ళలో ఎంతమార్పు...ఆలోచిస్తుంటే మనసుకి ఎలాగో అనిపిస్తుంది. అప్పటి స్వచ్చమైన గాలి, అందమైన ప్రకౄతి ఇప్పుడెక్కడ? లోకం ఇలా మారిపొతుంటే నాబోటి ప్రకౄతి ప్రేమికుని గతేంకాను?? ఈ నగరీకరణ మనల్ని ఎటు తీసుకుపోతుంది?

******************************************

ఇలా అనుక్షణం ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఓ శుభోదయాన బాల్కనీలో కూర్చుని ఉండగా జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రకౄతి ప్రేమికుడు గడచిన పదేళ్ళలో ప్రకౄతికేమి చేసాడనే ప్రశ్న బుర్రలో ఉదయించింది. చుట్టూ వచ్చి పడుతున్న బిల్డింగుల వల్ల చేలన్నీ మాయమైపోతుంటే నిట్టూరుస్తూ కూర్చోవటం తప్ప ఇప్పటి వరకు సొంత అపార్టుమెంటులో ఓ చెట్టు(మొక్క) కూడా నాటలేదే! మరి మొదటి చేను మా అపార్టుమెంటుకే కదా బలి అయ్యింది!! రోజూ వేల లీటర్ల చొప్పున బొరునుంచి నీటిని తోడటమే తప్ప ఎన్నడైనా వాన నీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అనే ఆలోచనే రాకపోయెనే! చుట్టూ జనావాసాలే కనిపించని రిసార్టుకోసం వెతికి మురిసిపోయానే తప్ప అదే పచ్చని ఆ పరిసరాలలో మొదటి మచ్చ అని తట్టలేదే!

ఇతరులమీద నెపం వేసి తప్పించుకోవటం తేలికే. మన పక్కవాడికి మనం కూడా "ఆ ఇతరుల" లో ఒకళ్ళమే!

Friday, 29 February 2008

బహు తేలికైన పని

లోకంలో నూడుల్స్ చెయ్యటం కంటే తేలికైన పని ఏదయునా ఉంది అంటే అది బహుశా ఉచిత సలహాలు/అభిప్రాయాలు విరజిమ్మటమేనేమో...

"లాభం లేదండీ, ఇక్కడొక ఫ్లై-ఓవర్ లేపాల్సిందే" నిస్సిగ్గుగా ఫుట్ పాత్ మీదకి బైక్ ఎక్కించేసి, సిగ్నల్ కోసం ఆత్రంగా ఎదురుచూసే ఓ పెద్ద మనిషి వ్యాఖ్యానం...

"వ్యవస్థ లో సమూలంగా మార్పు రావాలండీ..ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందా అని అనిపిస్తుంది" వాపోతుంటాడు ఎన్నడూ ఓటెయ్యని ఓ ప్రబుద్ధుడు...

"మనమూ ఒక బ్లాగు పెట్టేసి జనాలకి ఉపదేశం చేసేస్తేనో" అని ఆఫీసు టైం లో తెగ ఆలోచించేస్తుంటాడు నాలాంటి ఓ బడుద్ధాయి...

ఎక్కడో చదివాను...

ఓ పెద్దమనిషి బ్రతికినన్నాళ్ళూ సమాజాన్ని ఎలా సమూలంగా మర్చేద్దామా అని తెగ ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయాట్ట. చరమాంకం లో జ్ఞానోదయం అయి తన సమాధి దగ్గర ఇలా నోట్ వ్రాపించుకున్నాడట:

"సత్యం ఆలస్యంగా అవగతం అయ్యింది...సమాజాన్ని మార్చాలనే తపనలో నా గురించే మర్చాను! మార్పుని నాతో మొదలుపెట్టి నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా మలచుకుని ఉంటే, నన్ను చూసి కనీసం నా కుటుంబం మారేదేమో. నా కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు, వారిని చూసి నా ఊరు, ఊరిని చూసి సమాజం మారేదేమో కదా"

లోకం సంగతి తర్వాత తమ్ముడూ...ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం!!