Thursday 8 May 2008

సమాజసేవ ఎంతవరకు సమంజసం?

తప్పా-ఒప్పా అన్నది కాదు నా ప్రశ్న.ఎంతవరకు సమంజసం అని మాత్రమే.రెండు ప్రశ్నలూ ఒకటే అంటారా? అలా అయితే కొంచెం ఓపిగ్గా చదవండి మరి ....

మొదటగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను "సమాజ సేవ" అని ఉద్దేశించి అంటున్నది మనకు మామూలుగా తెలిసిన సేవా కార్యక్రమాల గురించి.అంటే పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించటం, వైద్యసేవ, ఊరిని బాగుచెయ్యటంవంటి వాటి గురించి మాత్రమే. ఇలాంటివికాక ఇంకేం ఉంటాయి అంటారా? కాస్త ఆగండి మరి....ఆ విషయం గురించే ఈ టపా వ్రాస్తున్నది.

సమాజానికి ఏదైనా చేద్దాం అనే తపన ఉన్నవాళ్ళు మామూలుగా ఎంచుకునే మార్గం - తమ తమ ప్రాధామ్యాలని బట్టి పైన ఉదహరించిన, లేదా అలాంటి వేరే కార్యక్రమాలని ఎంచుకోవటం, ధనరూపేణో/కార్యరూపేణో శాయశక్తులా సహాయం చెయ్యటం. అంతా బావుంది కానీ, "అసలు ఇలాంటి అవసరం సమాజానికి ఎందుకు ఏర్పడుతుంది?" అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం..


"సమాజ సేవ" అనగానే మీ మదికి తట్టిన ఏ ఆలోచననైనా తీసుకోండి. మీ సహాయం పొందాల్సిన స్థితి లో సమాజం ఉండటానికి కారణాలేమిటి? కారణాలేవైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత, లేక అసలు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సమాధానం ఈపాటికే మీకు తట్టి ఉండాలి...అవును, ఆ బాధ్యత మనం ఎన్నుకున్న ప్రభుత్వానిది కాదా? మరి అలా ప్రభుత్వాలు ఎందుకు చెయ్యటం లేదు? కొన్ని కారణాలు...

(1) చెయ్యలేకనా? కావొచ్చు...ఆదాయ వనరులు, లేక ఇతర వనరుల కొరత వల్ల ఇలా కావొచ్చు. కానీ ఇలా కొన్ని విషయాలలో మాత్రమే..బహు కొద్ది విషయాలలో. మనది ధనికదేశం కాకపోవచ్చు, కానీ కనీస సదుపాయాలు సమకూర్చుకోలేనంతటి పేదదేశం మాత్రం కాదు. అదీకాక మనం "వనరుల కొరత" అని చెప్పుకొనేది నిజానికి చాలావరకు వనరులని సరిగా వినియోగించుకోలేకపోవటం (ఉదాహరణకి అనవసరమైన ఆర్భాటాలకి నిధులు మళ్ళించటం) వల్ల ఏర్పడే "కృత్రిమ" కొరత. మరి అలాంటప్పుడు ఇది అసమర్ధత కాదా?

(2) అవగాహనా లోపం వల్ల కూడ ఇలాంటి పరిస్థితి దాపురించవచ్చు. పర్యావరణానికి సంబంధించిన సమస్యలన్నీ చాలావరకు ఈ కోవలోకే వస్తాయి. ఈ విషయంలో ఎవరికీ దురుద్దేశ్యం లేకపోయినా కేవలం అవగాహనారాహిత్యం వల్ల మనం చేసే చేటు అంతాఇంతా కాదు.

(3) నిర్లక్ష్యం: ఇదికూడా ఒకరకంగా సరైన అవగాహన లేకపోవటం వల్లనే. మారుతున్న జీవన శైలి, భాష/సంస్కృతుల పట్ల నిర్లక్ష్యం ఇలాంటివన్నీ. ఈ నిర్లక్ష్యం వ్యక్తిగతం కావొచ్చు, లేక ప్రభుత్వపరంగా కొన్ని సందర్భాలలో ఉండే నిర్లక్ష్యం కావొచ్చు.

(4) అవినీతి వగైరా: విపులీకరించనవసరం లేదనుకుంటాను.

సరే. కారణాలు కొంతవరకు గుర్తించాం. ఇప్పుడు మళ్ళీ అసలు విషయంలోకి వద్దాం....

మీరు మీ సొంత ఊరిలో ఆసుపత్రి కట్టించి సేవ చేయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ సరైన వైద్యం లేక జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచిదే. మరి ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సంగతేమిటి? ఆ ఆసుపత్రి ఎందుకు సరిగ్గా పనిచెయ్యటం లేదు? పైన చెప్పిన 4 కారణల వల్ల కాదా? అలాంటప్పుడు మనం సొంత నిధులు ఖర్చుపెట్టి ఒక ఆసుపత్రి కట్టించటం సమంజసమా, లేక మన నిధుల్ని దుర్వినియోగించటాన్ని అరికట్టటం సమంజసమా?

మీరనొచ్చు...వ్యవస్థని చక్కదిద్దటానికి ఎంతో సమయమూ, శ్రమా కావాలి. అప్పటివరకు జనాల బాధని పట్టించుకోకుండా ఉండాలా అని. అలా అని నేననటంలేదు. చెయ్యగలిగినంత సాయం చేయ్యండి...ఆసుపత్రులు కట్టించండి, పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించండి, మరేదైనా చెయ్యండి. కాని చేసేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి - ఇవన్నీ చెయ్యవలసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అని. మీరు ఇలా కేవలం "ఇలాంటి" సమాజ సేవ చేసేవరకు వాళ్ళలా తప్పించుకు తిరుగుతూనే ఉంటారు అని. ఎందుకంటే వాళ్ళ పని చెయ్యటానికి మీరు ఉన్నారు కదా! నేను చెప్పొచ్చేది ఒక్కటే -మీరు చెయ్యాలనుకున్న సాయం చెయ్యండి, కాని అదే సమయంలో అసలు సమస్య గురించి కూడ కొంచెం ఆలోచించండి.

ఈ రోజు దేశంలో కొన్ని వేల సంఖ్యలో స్వచ్చంద సేవా సంస్థలు ఉన్నాయి. కొన్ని కోట్ల విరాళాలు పోగవుతున్నాయి. ఎన్నోరకాల సామాజిక సేవ జరుగుతోంది. మరి అన్ని సమస్యలకు పెద్దమ్మలాంటి రాజకీయాలను, పాలనా వ్యవస్థను చక్కదిద్దటానికి ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఎందరు విరాళాలు ఇస్తున్నారు? "సామాజిక" సేవకి మనమందరం, అన్ని స్వచ్చంద సంస్థలు కలిపి చెస్తున్న కృషిలో కొంత శాతమైన ఇందుకు వెచ్చిస్తే ఫలితాలు ఎలాఉంటాయో ఊహించుకోండి.

సాయం చేస్తున్నామా, లేక మళ్ళీ మళ్ళీ సాయం అడిగే పరిస్థితి కల్పిస్తున్నామా??

16 comments:

Indian Minerva said...

Good,
That means charity is not a solution for all. Infact charity could make vegabonds and paracites who would be seeking everything out of others if its not directed towards the "right" people and lacks the "right" cause.

Sujata M said...

మీ టపా సారాంసం బాగుంది. నిజంగానే మన దేశం లో ఒక వ్యవస్థీకృతమైన సమాజ సేవ జరగటం లేదు. సునామీ తరవాత ఎన్నో పత్రికలు వ్యర్ధమైపోయిన వస్త్రాలూ.. విరాళాల గురించి కధనాలు ప్రచురించాయి. ఒక గ్రామంలో హాస్పిటల్ / ప్రైమరీ మెడికల్ సెంటర్ ఉంటుంది. కానీ దాని పరిధి చాల చిన్నది. దాన్ని ప్రభుత్వ వనరులతో నడుపుతున్నప్పుడు దాని సేవలు కూడా (సేవలు అందించాల్సిన జనాభా తో పోలిస్తే..) నాణ్యతా పరంగా తక్కువ గా ఉంటాయి. అప్పుడు ఆ హాస్పిటల్ లో మరిన్ని వార్డులు నిర్మించడానికి గానీ, ఆధునీకరణ లేదా, స్టాఫింగ్, ప్రైవేట్ విరాళాలతో జరపగలిగితే, సేవల ప్రమాణాలు పెరుగుతాయి. అయితె ప్రైవేట్ నిధులు అధికారికంగా సరైన విధంగా ఖర్చుపెట్టగాలగాలి. ఆధునిక దేశాల లో మాదిరిగా భారత దేశం లో కూడా వివిధ సంస్థలు ఇలాంటి ఆలోచనలను ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. మన దేశం లో చాల సంస్థలు విరాళాలు గా కాష్, కొత్త వస్తువులు (పిల్లల చారిటీ లు కొత్త స్టేషనరీ బల్క్ లో.. లేదా కొత్త పుస్తకాలు...) మాత్రమే స్వీకరిస్తాయి. వాలంటీర్లు కూడా క్షేత్రాలలో (సాధారణం గా పల్లెలు) పని చెయ్యాలి. సిటీ ల లో కేవలం ధనిక వర్గాలు మాత్రమే పాల్గొన గలిగే విధంగా చాల చారిటీ లు పనిచేస్తున్నాయి.

మధ్య తరగతి ప్రజానీకం కూడా నగర వాతావరణం లో చారిటీ ల లో పాల్గొనాలంటే పాత వస్తువులు విరాళాలు గా స్వీకరించోచ్చు. వాటిని చారిటీ వారి రెగ్యులర్ సెకండ్ హాండ్ షాప్ ల లో అమ్మొచ్చు. ఇలా చెయ్యటం వల్ల అపుడపుడూ అందరికీ సమాజ సేవ చేసే అవకాసం దొరుకుతుంది. (Every little helps) ఇంకా వీటి ద్వారా లభించే లాభాలతో చారిటీ ల కు నిలకడైన ఆదాయం లభిస్తుంది. అలానే చారిటీ లు తమ తమ విరాళాలతో పాటూ ప్రభుత్వ సబ్సిడీ లూ.. ఇతరత్రా నిధులతో తమ ఆబ్జెక్టివ్ లను చాల ఆర్గనైసేడ్ గా సాధించొచ్చు. ఈ చారిటీ లు ప్రతీ ఏడూ తమ ఆడిట్ జరిపించుకుంటాయి. కాబట్టి వాటికి కూడా జవాబుదారీ తనం ఉంటుంది. మనం వ్యక్తిగతంగా సమాజ సేవ చెయ్యాలంటే, ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియకుండా, మీరన్నట్టు, ఒక తొందరపాటు తో దూకితే చాలా మనకూ మన ఆసయానికీ నష్టం కలుగుతుంది.

బహుసా మనకు మొదట ఆ ఆలోచన తో పాటూ.. ఒక వ్యవస్థ కూడా ఉంటే బావుంటుంది.

రాధిక said...

చాలా మంచి వ్యాసం.మూలాలను బాగుచెయ్యమనడం బాగుంది.ఇలాంటి వ్యాసాలు పత్రికల్లో వస్తే మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది.

Naga said...

సరైన ప్రశ్న వేశారు. సమాజ సేవ చేయడంలో ఉన్న ఆనందం, సురక్షత సమాజాన్ని 'రిపేరు' చేయడంలో లేదు, పైగా స్వార్థపరుల యొక్క ఆగడాలను ఎదుర్కోవడంలో కష్టాలు ఉంటాయి. బాగుంది టపా.

సుజాత వేల్పూరి said...

మీ వ్యాసం ఆలోచింపచేసేలా ఉంది. కాని మీరు చెప్పినట్టు తప్పించుకు తిరిగే వాళ్ళని పట్టుకుని, చట్టపరంగా వాళ్లు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించేలా చెయ్యడానికి చాలా సమయం కావాలి. ఈ లోపు సేవ అవసరమైన వారి పరిస్థితి ఏమిటి?(చూసారా, మళ్ళీ మీరు చెప్పిన చోటికే వచ్చింది పరిస్థితి?) ఇది చేయడానికి ఒక వ్యక్తి చాలరు. ఒక సంస్థ, జనాన్ని జాగ్రుతం చేసే కొంతమంది ప్రజలు కావాలి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం ఉన్న (వసూలైన డబ్బులెక్కడున్నాయి? ఏం చేసారో చెప్పండి? అని నిలదీస్తే, వారు ఊరికే చూస్తూ ఉంటారా మరి! ఏదో ఒకటి చేస్తారుగా?) కార్యకర్తలు కావాలి.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, విరాళాలిచ్చేటపుడు ఆదాయపు పన్ను మినహాయింపు వచ్చే సంస్తలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల అటువంటి సౌలభ్యం లేని, డబ్బు అవసరం ఉన్న సంస్థలు నష్టపోతాయి. అంటె ఇచ్చే విరాళాలలో కూడా చిత్త శుద్ధి ఉండాలి. ఏదో స్వామి కార్యం, స్వకార్యం అన్నట్టు ఉండకూడదు.

ఈ సందర్భంగా ఒక సంస్థ గురించి చెపుతాను.(అసందర్భం అనుకోకపోతే) హైదరాబాదులో ఉప్పల్ దగ్గర 'అంకురం ' అనే స్వచ్చంద సంస్థ ఉంది. ఆ సంస్థ కేవలం ఆడపిల్లలకు రక్షణ కల్పించి చదువు చెప్పించే సంస్థ. ఆ పిల్లల్లో సెక్స్ వర్కర్ల పిల్లలు, అనాధలు, తల్లి దండ్రులు ఉండీ చదువుకోలేని వారు..ఉంటారు. వారికి పుస్తకాలు , బట్టలు, చెప్పులు ఆడపిల్లలు కాబట్టి ఇంకా అనేకం కావలసి ఉంటాయి. ఈ సంస్థకు సహాయం చెయ్యాలంటే, నాకెంతో ఇష్టం. వెళ్ళగానే అమాయకంగా చుట్టుముట్టే ఆ పిల్లలంటే ఇష్టం. కానీ వాళ్ళకు వచ్చే విరాళాలు స్వల్పం. ఇటువంటి సంస్తలను గుర్తించి 'నిజంగా సహాయం అవసరమైన ' వాళ్లకు సహాయం చేయడం అవసరం.

మధు said...

ఆలోచన బాగుంది. నేను రాధిక గారితో ఏకీభవిస్తున్నాను. పత్రికలలో ఇటువంటి వ్యాసాలు రావాలి. ప్రజలు ఆలోచించాలి. కానీ మీరు చెప్పినట్లు సహాయం చెయ్యడం తో పాటు ఉన్న సిస్టమ్ ని బాగు చెయ్యడం చాలా మంచి ఉత్తమమైనది. ఏమినా దీనిమీద డిస్కషన్స్ జరిగితే మనకు సమాధానాలు దొరకవచ్చు. ఎలా చెయ్య వచ్చు, దీనికి ఉత్తమ పద్దతి ఏమిటి ... ఇవన్ని మాట్లాడుకుంటే బావుంటుంది. దీని మీద మీ అభిప్రాయాలు పంపగలరు.

Siva said...

@ వ్యాఖ్యాతలందరికీ పేరు పేరునా ...

మీ మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. సుజాత గారు అన్నట్లు నిజంగా అవసరం అయిన వాళ్ళకు సాయం చెయ్యాలి, అది మన బాధ్యత కూడా. అక్కడితో ఆగిపోక "ఇంకొంచెం ముందుకు వెళ్దాం" అని మాత్రమే నేను చెప్తున్నాను.

ఇక మధుగారన్నట్లు ఈ విషయంపై చర్చ జరగాలి. ఈ విషయంపై నా తరువాతి టపాలలో మరింత వివరంగా విశ్లేషణ చెయ్యటానికి ప్రయత్నిస్తాను. అవసరాన్ని తెలియచెప్పటంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అందుకే ఈ టపాతో ఆరంభించాను. కొంతసమయం ఇవ్వండి.

మనం చెప్పదలుచున్న/చర్చింపదలచుకున్న విషయంపై అవగాహన మరియు స్పష్టత ముఖ్యం. అందుకే ఒక్కో అంశంపై విడి విడిగా టపాలు వ్రాయాలనుకున్నాను. అవసరం ఏమిటి? మనం నిజంగా ఈ విషయంలో ఏమైనా చెయ్యగలమా? మన విధానం ఎలా ఉండాలి? ఇలా ఒక్కో విషయాన్ని వేరు వేరుగా స్పృశిద్దామని నా ఆలోచన.

మరొక్కసారి మీ అందరికి ధన్యవాదాలతో .....

Chaks said...

వ్యాసం బాగుంది. వాటితో పాటు మరికొన్ని కోణాలు. ప్రభుత్వం చేస్తున్న పనులకు సంభందించి న పూర్తి సమాచారం ప్రజకు అందుబాటులో లేకపోవడం.ప్రస్తుతం సమాచార చట్టం వచ్చినా దానిని ఉపయోగించుకోక పోవడం. ప్రతీదానికీ మనకెందుకులే అనే ధోరణి.
ప్రతీపనికీ తాత్కాలిక ఉపశమనం/దీర్ఘ్హకాలిక ఉపశమనం ఉంటాయి.ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు దుప్పట్లు/తిండి మొ|| తాత్కాలిక ఉపశమనం, అదే దీర్ఘ్హకాలవుపశమనానికి వస్తే ఇళ్ళు కట్టించడం వగైరా. తాత్కాలిక ఉపశమనానికే ఎక్కువగా ప్రజల స్వచ్చంద సంస్థల మద్దతవసరం ఉండొచ్చు. సాయిబాబా అనంతపురం దాహార్తి తీర్చడానికి డబ్బులెందుకిచ్చారు అంటే ప్రభుత్వం కేవలం ఒక్క జిల్లాకే ఒకేసారి అంత ఖర్చు పెట్టలేదు కాబట్టి, ప్రభుత్వమే చెయ్యాలంటే మరో పదేళ్ళు ఆగాలి కాబట్టి. ప్రభుత్వంతో పోరాడే శక్తిలేనివాళ్ళకి ఆసరా స్వచ్చంద సంస్థలే. అయితే మీరన్నట్లు ప్రజలను జాగృతాం చేసి వాళ్ళ కర్తవ్యాన్ని (దీర్ఘ్హకాలిక ఉపశమనం)తెలియజెప్పే సంస్థలు మాత్రం లేవు.

శ్రీ said...

బాగుంది మీ ఆలోచన. సమాజ సేవ చేసేవాళ్ళూ దాంట్లో భాగంగా ప్రభుత్వం చేసే సేవల్లో పాలు పంచుకుంటే బాగుంటుంది. చక్స్ గారు చెప్పినట్టు ప్రభుత్వం చేసె పనులు ఒక వెబ్ సైటు లో ఉంటే మనం దానికి తగిన సహకారం చేయచ్చు. అపుడు పంజాగుట్ట బ్రిడ్జులు పడవు, ప్రభుత్వం సొమ్ము సరిగ్గా వాడుకోవచ్చు.

Anonymous said...

సుజాత గారన్నట్టు వాళ్ళు చేస్తారని వీళ్ళు, వీళ్ళు చేస్తారని వాళ్ళు అనుకునే లోపు సహాయం అవసరమైన వాళ్ళ జీవితాలు తల్లక్రిందులవుతాయి. ఇలాంటి సమయంలో చేతనైనంత సహాయాన్ని నిస్వార్ధంగా అందించటంలో తప్పులేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రభుత్వం తలచుకుంటే నిస్సందేహంగా మన దేశాన్ని అద్భుతంగా మలచుకోవచ్చు. ఏ ప్రణాళికనైనా అమలుపరచటం స్వార్ధ పరుల మీద ఆధారపడుతుండటం వల్లనే అవన్నీ వ్యర్ధమైపోతున్నాయి. మీరు స్పృశించిన కోణాలలో ఎంతో పరిణితి ఉంది. అయితే వాటికి సమాధానాలు ఇలా వ్యాఖ్యల్లో కాకుండా ప్రాక్టికల్ గా ఉన్నప్పుడే మీరు కోరుకున్న సమాజం జనిస్తుంది.

Bolloju Baba said...

మంచి వ్యాసం. ఎన్నో ఆలోచనలను రేకెత్తించిన వ్యాస>

Kathi Mahesh Kumar said...

మీ వాదన బాగుంది. కానీ మీదగ్గర కొంత సమాచార లేమి ఉందని తెలుస్తోంది. మీరుచెప్పిన పాలన, రాజకీయాలలో సంస్థాగత మార్పు(Institutional change)లకోసం చాలా అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో పనిచేస్తున్నాయి.

DFID, UNICEF,WHO,World Bank,AusAID, USAid, ADB వాటిల్లో కొన్ని మాత్రమే.

నేను ఈ "మార్పు" వ్యవస్థలో భాగంగానే పనిచేస్తున్నవాడ్ని కాబట్టి దీనిగురించి ఒక టపా త్వరలో రాస్తాను. బహుశా దానిలో మీ కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకొచ్చు.

Siva said...

@ Chaks గారు, శ్రీ గారు, నువ్వుశెట్టి బ్రదర్స్ గారు, బొల్లోజు బాబా గారు, మరియు మహేష్ గారు: మీ మీ స్పందనలకు, సూచనలకు ధన్యవాదాలు. నేను బ్లాగు విషయంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోవటంతో ఈ టపాకు పొడిగింపుగా అనుకున్న మిగతా వ్యాసాలు అంత త్వరగా వ్రాయలేకపోతున్నాను.

@ మహేష్ గారు: మీరు సూచించిన 7 సంస్థలలో ఐదింటి గురించి నాకు అవగాహన ఉంది. అవి కాక Jangraha, FDR, ADR లాగా కేవలం పాలనా వ్యవస్థలో మార్పు కోసమే పనిచేస్తున్న సంస్థలు కూడా తెలుసును. రాజకీయలలో సంస్థాగత మార్పులకు పాటుపడే సంస్థలు లేవని నా ఉద్దేశ్యం కాదు. ఈ రోజున మనం ఏ నగరాన్ని తీసుకున్నా స్వచ్చంద సేవా సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉండి, సమాజానికి ఎమైనా చెయ్యాలి అని ఎదో చిన్న కోరిక ఉన్న ఏ వ్యక్తిని తీసుకున్నా తన మదిలో వచ్చే ఆలోచన రాజకీయాలని మార్చటం అని అయివుండటం చాలా అరుదు. సమస్య ఎక్కడుందంటే మనం మూలాలని బాగు చెయ్యటం మరుస్తున్నాం. అదే నేను చెప్పదలచుకున్నది. Let's shift the focus! And I will definitely look forward to your post.

Anonymous said...

hi,

meeru cheppindi correct ee kaani ee rajakeeyalanu marchadatam anedi okaritho ayye panena....ippudu vunna situation lo manam mana works ni vadulukoni rajakeeyalanu marche prayathnam sadhyama?
even iam the one who wants to change something in our india. Please suggest........

Siva said...

@ Anonymous:

You, me or any one alone may not be able to do change anything completely. But if "no one" is trying "any thing", then "nothing" will change. Good thing is that we already have organizations which are working for better governance. We can contribute our efforts/money to these, instead of contributing to a typical NGO. That's the objective of my post. Mail me directly prasadgummadi-AT-yahoo.com for any further details

Samudragarbham said...

మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థాంక్స్.. నా ఆలోచనలతో ఏకీభవించేవారు దొరికినందుకు సంతోషంగా ఉంది.. మీ ” సమాజసేవ ఎంతవరకు సమంజసం” టపా చదివాను. సరైన ఆలోచన. పునాదిలో మార్పు రాకుండా, సమస్యయొక్క మూలంలో మార్పు రాకుండా, పైపై సేవలతో సమస్యకి కొంతమేర సాంత్వన చేకూర్చవచ్చునేమోగాని పరిష్కరించడం అసాధ్యం. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నిటికీ మూలం రాజకీయంలోనే ఉందని నా వాదన. దానిపై దృష్టి పెట్టడం అవసరం. ఎందుకంటే మనం ఇవ్వాళ ఎంతో ఉదారంగా సమాజసేవ చేస్తాం, మరి రేపు మన తరవాత చేసేదెవరూ?
అదే ఆ శక్తియుక్తులన్నిటినీ మూలాన్ని ప్రక్షాళణ చేయడంలో వెచ్చిస్తే కనీసం తరవాతి తరాలైనా సమస్యలు లేకుండా జీవించగలవని నా నమ్మకం.!