ఇంతకుముందు టపాల్లో చెప్పుకున్నట్లు మన వంటింటి చెత్త నుంచి అతితేలికగా కంపోస్టు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్ళేముందు తేలిగ్గా అవగాహన అవటానికి మనం ఇంతకుముందు అనుకున్న అరటి తొక్క గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆరుబయట పారేసిన అరటి తొక్క మనం చూస్తూ ఉండగానే కంపోస్టు అయ్యి భూమిలో కలిసిపోతుంది కదా! ఇక్కడ అసలు ఏం జరిగింది? ఎలా అరటి తొక్క అంత తేలిగ్గా ఎవరికీ శ్రమ ఇవ్వకుండా ఎలా కంపోస్టు అయ్యింది??
ఆరుబయట గాలిసోకుతున్న ఏ ఆహార పదార్థమైనా అందులోని సూక్ష్మ క్రిములవల్ల మెల్లగా కుళ్ళిపోయి నేలలో కలిసిపోతుంది. అంతే! ఇంతకంటే ఈ విషయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన/నేర్చుకోవాల్సిన బ్రహ్మ పదార్థమేమీ లేదు!!
ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని మన వంటింట్లోకి ఎలా అన్వయించుకుందామో చూద్దాం. ఇందుకు మనం చెయ్యాల్సిందల్లా ...
1. వంటింటి చెత్తని వేరుచెయ్యటం: వంటింట్లో మిగిలిన ఆహారాన్ని (కూరగాయముక్కలు, ఆకులు, మిగిలిపోయిన అన్నం, కూర వగైరా) మిగతా చెత్తతో కలపకుండా కంపోస్టుకోసం వేరుగా ఉంచటం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం క్రింద జల్లెడలా ఉన్న గిన్నె ఏదైనా వాడొచ్చు - అయితే ఈ గిన్నెని ఇంకొంచెం పెద్ద గిన్నెలో ఉంచి పెట్టుకోవాలి. ఎందుకో మీకీపాటికే అర్థం అయిఉంటుంది: పై గిన్నెలో ఒకవేళ ఎక్కువ నీరు ఉంటే అది మెల్లగా క్రింద గిన్నెలోకి దిగిపోతుంది. ఎక్కువ చెమ్మ ఉంటే కంపోస్టు త్వరగా కాదు మరి!
2. ఎప్పటికప్పుడు: ఇలా విడిగా పెట్టుకున్న గిన్నెని ఏ పూటకా పూట మన కంపోస్టు కుండలలోకి ఖాళీ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మనం కంపోస్టు చెయ్యబోతున్న వంటింటి చెత్తలో ఎంత ఇంకిపోయినా చెమ్మ ఎక్కువగానే ఉంటుంది. అందుకే దీన్ని మనం కంపోస్టు కుండలలో వేసేటప్పుడు తప్పకుండ పేపరు ముక్కలు లేదా ఎండు ఆకులు కలిపి వెయ్యాలి (బయట పారేసిన అరటి తొక్కకి ఈ సమస్యలేదు..కుండిలో కాకుండా ఆరు బయటే ఉంది కాబట్టి ఎంచక్కా గాలికి తడారిపోతుంది)
3. ఇక అసలు సంగతి - కంపోస్టు కుండలగురించి. ఇలా అనగానే ఇందుకోసం ఎదో ప్రత్యేకంగా తయారుచేసిన కుండలు గట్రా వాడాలేమో ఆనుకోకండి! మనకి కావాల్సిందల్లా ఒకదానిమీద ఒకటి పేర్చుకోవటానికి (ఇది కూడా కేవలం ఖాళీ ఆదా చేసుకోవటానికి, అలా కుదరకపోయినా ఇబ్బంది లేదు) వీలుగా ఉన్న 3 కుండలు. అయితే వీటికి గాలి ఆడటానికి వీలుగా చుట్టూ చిన్న చిన్న బెజ్జాలు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఈ కుండలు ఒకదానిమీద ఒకటి పేర్చినప్పుడు ఇలా ఉంటాయి:
ఇప్పుడు మనం వంటింటి చెత్తని మొదట పైనున్న కుండలో వెయ్యటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఇది నిండి పోతుందో, అప్పుడు దాన్ని క్రిందకి మార్చి రెండో కుండలో వెయ్యటం మొదలు పెట్టాలి. ఇలానే తర్వాత మూడో కుండలోకి.
4. కలియపెట్టటం: ఇప్పుడు మనం అప్పుడప్పుడు (వారానికొక్కసారి) చెయ్యాల్సిన పని ఒకటుంది. ఎంతగా మనం బెజ్జాలు ఉన్న కుండల్లో ఉంచినా గాలి సరిగ్గా ఆడదు కాబట్టి అప్పుడప్పుడు కలియపెట్టాలి.అలా చేసేటప్పుడు వేలైతే వీపపొడి, పసుపు కలుపుకోవచ్చు.
ఇంతేనా? ఇంతకీ మనం ఇందులో కంపోస్టు ఎక్కడ తయారుచేసాం??
ఈ ప్రశ్నకి సమాధానం మీకు ప్రకృతే చెప్తుంది - ఎందుకంటే అసలు పని చేసింది ప్రకృతే కాబట్టి. మనం కేవలం అందుక్కావాల్సిన ముడి సరుకులు (చెత్త, గాలి) అందించాం. అంతే!!
ఈ విషయం మీ అంతట మీరు తెలుసుకోవటానికి కొన్నాళ్ళు పోయాక మూడు కుండలు గమనించండి...
మొదటి కుండలో అప్పుడప్పుడే వేస్తున్న వంటింటి చెత్త:
రెండో కుండలో దానంటతదే తయారవుతున్న కంపోస్టు:
ఇక మూడో కుండలో మనం మొక్కలకి వాడుకోవటానికి సిద్దంగా కంపోస్టు:
తెలుసుకున్నారు కదా? తప్పకుండా మీమీ ఇళ్ళల్లో కంపోస్టు తయారు చెయ్యటం మొదలుపెడతారని ఆశిస్తాను. మీకు ఎమైనా సహాయం చెయ్యగలను అనుకుంతే తప్పకుండా నన్ను సంప్రదించండి! ఇంతకుముందు చెప్పినట్లు కంపోస్టు చెయ్యటం మొదలు పెట్టాక మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది
ఇంకొక ముఖ్యమైన విషయం: చెత్త సమస్యకి పరిష్కారం కేవలం ప్లాస్టిక్ వాడకం తగ్గించటం, చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చేసుకోవటమే కాదు. వీటన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన/మార్చుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటో వచ్చే టపాలో చెప్పుకుందాం!
7 comments:
చాలా ఉపయోగకరమయిన సమాచారం ఇచ్చారు.
ధన్యవాదాలు.
శివ గారు చెత్త పోస్ట్ లు అన్ని బావున్నాయి.
మంచి సమాచారం ఇచ్చారు.
థాంక్స్ అండి
bagundhi ee idea... oke saari rendu labhaalu. keep ur socity clean and natural ga plants kosam t kooda
శైల బాల గారూ..
ధన్యవాదాలు! ముఖ్యమైన టపా ఒకటి ఈ "చెత్త పని" సిరీస్‌కి ముగింపుగా వ్రాయాలనుకుంటున్నాను..అది కూడా చదివి మీ అభిప్రాయం చెప్పండి
కావ్యాంజలి గారూ & శ్లోకా శాస్త్రి గారు..
అన్ని పోస్టులు ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు! మీకు వీలున్నంతలో మీరు కూడా ఇలా కంపోస్టు చెయ్యటం మొదలుపెట్టండి. చాలా మంది అపోహపడుతున్నట్లు ఇది కష్టమైన పని ఏమీ కాదు. అదీ కాక ఇది మనందరి బాధ్యత కూడా.
ఎవరో పెద్దలు చెప్పినట్లు పెద్ద పెద్ద సమస్యలకి అంతేసి పెద్ద పరిష్కారాలు ఉండవు. చిన్న చిన్నవి, ప్రతి ఒక్కరు చెయ్యగలిగినవే నిజమైన మార్పుని తీసుకొస్తాయి!
గుమ్మడి ప్రసాద్ గారికి
మీ బ్లాగు ని ఇదే మొదటి సరి చూడటం
చూసి చాలా ఆనందం వేసింది
రీ సైక్లింగ్ అనే అంశం మీద ఇంత బాగా తెలుగు లో ఒక బ్లాగు
ఆవిర్భవిస్తుందని నేను అనుకోలేదు.
అయినప్పటికీ పరిశోదనాత్మకంగా మీ బ్లాగు లో కంటెంట్ ను ఇంకా
డెవలప్ చేస్తారని భావిస్తున్నాను.
శాస్త్ర విజ్ఞానం మీద ఉన్న అతి తక్కువ తెలుగు బ్లాగుల్లో
మీ బ్లాగు కూడా చేరుతుందని భావిస్తూ
మీ శ్రేయోభిలాషి
-చైతన్య దీపిక
@ కొయిలాడ బాబు గారూ..
మీ ప్రోత్సాహానికి, అభిమానానికి ధన్యవాదాలు!! మీరు సూచించినట్లు ఇంకా ఎక్కువ శ్రధ్ధ తీసుకుని వ్రాయటానికి ప్రయత్నిస్తాను
- శివ
Post a Comment