Tuesday, 20 May 2008

ఆ రోజుల్లో ....

(బాల్య స్మృతులను నెమరు వేసే కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు. టపా యొక్క అసలు ఉద్దేశ్యం వేరు)

పోయిన వారమే అంగీరసనామ సంవత్సరానికి సాదరంగా రెండోసారి ఆహ్వానం పలికాను.

మనవడికి వేసవి సెలవులు కావటంతో గడుగ్గాయితో ముచ్చట్లు పెట్టుకోవటానికి కొంత వీలు చిక్కింది. ఎప్పుడైనా ఇలా అవకాశం దొరికితే తన బళ్ళో సంగతులు చెప్పి విసిగించటం వాడి అలవాటు.ఈ సారి వాడికా ఛాన్సు ఇవ్వకూడదని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నాను. ఆ ప్రకారంగా పథక రచన కూడా చేసేసుకున్నాను.

అలా అని కష్టపడి కొత్తగా ఏమీ ఆలోచించలేదులెండి. అందరు తాతయ్యలలానే నేను కూడ నా మనవడితో నా బాల్యస్మృతులు పంచుకునే కార్యక్రమం పెట్టుకున్నాను.

"రేయ్ కన్నా, నా చిన్నప్పుడు..." అంటూ మొదలు పెట్టి ఆనాటి జ్ఞాపకాల్ని ఒక్కొక్కటీ పంచుకోవటం మొదలెట్టాను. మొదట్లో అంతగా ఆసక్తి చూపనివాడు కాస్తా నేను ఆ రోజుల్లో మేము ఎంత స్వేచ్ఛగా జీవించేవాళ్ళం, ఈ రోజుల్లో అతిపరిమితంగా/అరుదుగా లభించేవన్నీ ఆ రోజుల్లో మేము ఎంతగా మనసారా ఆస్వాదించేవాళ్ళం అంటూ చెప్తుండేసరికి బుద్దిగా ఆలకించసాగాడు.

"నీకో సంగతి తెలుసా? నా చిన్నప్పుడు నీళ్ళకి కొదవే ఉండేది కాదు. ఏటి పక్క ఊరు కదా, 30/40 అడుగులలోనే తియ్యటి మంచి నీళ్ళు పడేవి! అంత పెద్ద ఇల్లు శుభ్రం చెయ్యటం, వాకిలి అంతా రోజూ కల్లాపి చల్లటం, అంతా మంచి నీటితోనే. ఇల్లళ్ళోనేకాక వీధికొక పంపు ఉండేది. కొలతలు పెట్టుకుని వాడటం, గుంటలు తవ్వి వాన నీళ్ళు దాచిపెట్టుకోవటం ఇలాంటివన్నీ కనీ వినీ ఎరగం మేము!"

ప్రస్తుత పరిస్థితితో బేరీజు వేసుకున్నాడు కాబోలు, బుజ్జిగాడి మోములో ఆశ్చర్యంతో కూడిన చిన్నపాటి అసూయ....

ఆ మాత్రం చోదనం చాలు నాకు, మరిన్ని విశేషాలు వివరించటానికి సిద్దపడి పోయాను..

"అప్పట్లో ఫలానా చైనా దేశంలో ప్రభుత్వం ఒకరికంటే ఎక్కువ పిల్లల్ని కనొద్దని రూల్సు పెట్టేదని విడ్డురంగా చెప్పుకునే వాళ్ళం. ప్చ్....ఇప్పుడు మీకాలంలో ఇలాంటివి మన దేశంలో కూడా చూడబోతున్నామని ఎన్నడూ ఊహించలేదురా! ఏ పండగకో పబ్బానికో తప్ప ఎన్నడూ బంధువులే కనపడటం లేదు! నా చిన్నప్పుడు ఏ ఇల్లు చూసినా ఎప్పుడూ సందడి సందడిగా కళకళలాడుతూ ఉండేవి. ఏ పిల్లవాడిని తీసుకున్నా కనీసం 3/4 బాబాయ్‌లు, అత్తమ్మలు....ఇంట్లో ప్రతి రోజూ పండగ రోజులానే ఉండేది"

'చిన్నపాటి ' అసూయకాస్తా కొంచెం పెరిగి పెద్దదయ్యింది. అందుకు అనుగుణంగా నా జోరూ కూడా పెరిగింది....

"చెప్తే నమ్మవుకాన్రా, అప్పట్లో ఇలా చెట్టు చెట్టుని లెక్క పెట్టుకుని కాపాడుకోవటం, ప్రతి సంవత్సరం ఇన్ని చెట్లు నాటాలి అని కార్యక్రమాలు పెట్టుకోవటం మాకు తెలియవు. ఊర్లోకానీ బస్తీలోకానీ ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు కళకళలాడుతుండేవి. "ఒక చెట్టు నరికితే రెండు చెట్లు నాటాలి" లాంటి రూల్సూ చెత్తా ఏమీ అవసరం ఉండేవికాదు. లెక్కకు మిక్కిలి చెట్లు ఉండేవిమరి!"

అప్పటిదాకా లీనమైపోయి వింటున్న వాడు ఇక ఎదో అడగాలని నోరు తెరిచాడు. బహుశా అలనాటి మధురస్మృతులనుంచి మరేదైనా విశేషం తెలుసుకోవాలనేమో. "ఏంటి చెప్పు" అన్నట్లు కళ్ళెగరేసాను, కించిత్ గర్వంతో...

"మీరందరూ ఆ రోజుల్లో అంతలా జల్సా చెయ్యకుండా జాగ్రత్తపడి ఉంటే, మాకిప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదుకదా తాతయ్యా?"

Thursday, 8 May 2008

సమాజసేవ ఎంతవరకు సమంజసం?

తప్పా-ఒప్పా అన్నది కాదు నా ప్రశ్న.ఎంతవరకు సమంజసం అని మాత్రమే.రెండు ప్రశ్నలూ ఒకటే అంటారా? అలా అయితే కొంచెం ఓపిగ్గా చదవండి మరి ....

మొదటగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను "సమాజ సేవ" అని ఉద్దేశించి అంటున్నది మనకు మామూలుగా తెలిసిన సేవా కార్యక్రమాల గురించి.అంటే పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించటం, వైద్యసేవ, ఊరిని బాగుచెయ్యటంవంటి వాటి గురించి మాత్రమే. ఇలాంటివికాక ఇంకేం ఉంటాయి అంటారా? కాస్త ఆగండి మరి....ఆ విషయం గురించే ఈ టపా వ్రాస్తున్నది.

సమాజానికి ఏదైనా చేద్దాం అనే తపన ఉన్నవాళ్ళు మామూలుగా ఎంచుకునే మార్గం - తమ తమ ప్రాధామ్యాలని బట్టి పైన ఉదహరించిన, లేదా అలాంటి వేరే కార్యక్రమాలని ఎంచుకోవటం, ధనరూపేణో/కార్యరూపేణో శాయశక్తులా సహాయం చెయ్యటం. అంతా బావుంది కానీ, "అసలు ఇలాంటి అవసరం సమాజానికి ఎందుకు ఏర్పడుతుంది?" అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం..


"సమాజ సేవ" అనగానే మీ మదికి తట్టిన ఏ ఆలోచననైనా తీసుకోండి. మీ సహాయం పొందాల్సిన స్థితి లో సమాజం ఉండటానికి కారణాలేమిటి? కారణాలేవైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత, లేక అసలు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సమాధానం ఈపాటికే మీకు తట్టి ఉండాలి...అవును, ఆ బాధ్యత మనం ఎన్నుకున్న ప్రభుత్వానిది కాదా? మరి అలా ప్రభుత్వాలు ఎందుకు చెయ్యటం లేదు? కొన్ని కారణాలు...

(1) చెయ్యలేకనా? కావొచ్చు...ఆదాయ వనరులు, లేక ఇతర వనరుల కొరత వల్ల ఇలా కావొచ్చు. కానీ ఇలా కొన్ని విషయాలలో మాత్రమే..బహు కొద్ది విషయాలలో. మనది ధనికదేశం కాకపోవచ్చు, కానీ కనీస సదుపాయాలు సమకూర్చుకోలేనంతటి పేదదేశం మాత్రం కాదు. అదీకాక మనం "వనరుల కొరత" అని చెప్పుకొనేది నిజానికి చాలావరకు వనరులని సరిగా వినియోగించుకోలేకపోవటం (ఉదాహరణకి అనవసరమైన ఆర్భాటాలకి నిధులు మళ్ళించటం) వల్ల ఏర్పడే "కృత్రిమ" కొరత. మరి అలాంటప్పుడు ఇది అసమర్ధత కాదా?

(2) అవగాహనా లోపం వల్ల కూడ ఇలాంటి పరిస్థితి దాపురించవచ్చు. పర్యావరణానికి సంబంధించిన సమస్యలన్నీ చాలావరకు ఈ కోవలోకే వస్తాయి. ఈ విషయంలో ఎవరికీ దురుద్దేశ్యం లేకపోయినా కేవలం అవగాహనారాహిత్యం వల్ల మనం చేసే చేటు అంతాఇంతా కాదు.

(3) నిర్లక్ష్యం: ఇదికూడా ఒకరకంగా సరైన అవగాహన లేకపోవటం వల్లనే. మారుతున్న జీవన శైలి, భాష/సంస్కృతుల పట్ల నిర్లక్ష్యం ఇలాంటివన్నీ. ఈ నిర్లక్ష్యం వ్యక్తిగతం కావొచ్చు, లేక ప్రభుత్వపరంగా కొన్ని సందర్భాలలో ఉండే నిర్లక్ష్యం కావొచ్చు.

(4) అవినీతి వగైరా: విపులీకరించనవసరం లేదనుకుంటాను.

సరే. కారణాలు కొంతవరకు గుర్తించాం. ఇప్పుడు మళ్ళీ అసలు విషయంలోకి వద్దాం....

మీరు మీ సొంత ఊరిలో ఆసుపత్రి కట్టించి సేవ చేయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ సరైన వైద్యం లేక జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచిదే. మరి ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సంగతేమిటి? ఆ ఆసుపత్రి ఎందుకు సరిగ్గా పనిచెయ్యటం లేదు? పైన చెప్పిన 4 కారణల వల్ల కాదా? అలాంటప్పుడు మనం సొంత నిధులు ఖర్చుపెట్టి ఒక ఆసుపత్రి కట్టించటం సమంజసమా, లేక మన నిధుల్ని దుర్వినియోగించటాన్ని అరికట్టటం సమంజసమా?

మీరనొచ్చు...వ్యవస్థని చక్కదిద్దటానికి ఎంతో సమయమూ, శ్రమా కావాలి. అప్పటివరకు జనాల బాధని పట్టించుకోకుండా ఉండాలా అని. అలా అని నేననటంలేదు. చెయ్యగలిగినంత సాయం చేయ్యండి...ఆసుపత్రులు కట్టించండి, పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించండి, మరేదైనా చెయ్యండి. కాని చేసేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి - ఇవన్నీ చెయ్యవలసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అని. మీరు ఇలా కేవలం "ఇలాంటి" సమాజ సేవ చేసేవరకు వాళ్ళలా తప్పించుకు తిరుగుతూనే ఉంటారు అని. ఎందుకంటే వాళ్ళ పని చెయ్యటానికి మీరు ఉన్నారు కదా! నేను చెప్పొచ్చేది ఒక్కటే -మీరు చెయ్యాలనుకున్న సాయం చెయ్యండి, కాని అదే సమయంలో అసలు సమస్య గురించి కూడ కొంచెం ఆలోచించండి.

ఈ రోజు దేశంలో కొన్ని వేల సంఖ్యలో స్వచ్చంద సేవా సంస్థలు ఉన్నాయి. కొన్ని కోట్ల విరాళాలు పోగవుతున్నాయి. ఎన్నోరకాల సామాజిక సేవ జరుగుతోంది. మరి అన్ని సమస్యలకు పెద్దమ్మలాంటి రాజకీయాలను, పాలనా వ్యవస్థను చక్కదిద్దటానికి ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఎందరు విరాళాలు ఇస్తున్నారు? "సామాజిక" సేవకి మనమందరం, అన్ని స్వచ్చంద సంస్థలు కలిపి చెస్తున్న కృషిలో కొంత శాతమైన ఇందుకు వెచ్చిస్తే ఫలితాలు ఎలాఉంటాయో ఊహించుకోండి.

సాయం చేస్తున్నామా, లేక మళ్ళీ మళ్ళీ సాయం అడిగే పరిస్థితి కల్పిస్తున్నామా??