(బాల్య స్మృతులను నెమరు వేసే కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు. టపా యొక్క అసలు ఉద్దేశ్యం వేరు)
పోయిన వారమే అంగీరసనామ సంవత్సరానికి సాదరంగా రెండోసారి ఆహ్వానం పలికాను.
మనవడికి వేసవి సెలవులు కావటంతో గడుగ్గాయితో ముచ్చట్లు పెట్టుకోవటానికి కొంత వీలు చిక్కింది. ఎప్పుడైనా ఇలా అవకాశం దొరికితే తన బళ్ళో సంగతులు చెప్పి విసిగించటం వాడి అలవాటు.ఈ సారి వాడికా ఛాన్సు ఇవ్వకూడదని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నాను. ఆ ప్రకారంగా పథక రచన కూడా చేసేసుకున్నాను.
అలా అని కష్టపడి కొత్తగా ఏమీ ఆలోచించలేదులెండి. అందరు తాతయ్యలలానే నేను కూడ నా మనవడితో నా బాల్యస్మృతులు పంచుకునే కార్యక్రమం పెట్టుకున్నాను.
"రేయ్ కన్నా, నా చిన్నప్పుడు..." అంటూ మొదలు పెట్టి ఆనాటి జ్ఞాపకాల్ని ఒక్కొక్కటీ పంచుకోవటం మొదలెట్టాను. మొదట్లో అంతగా ఆసక్తి చూపనివాడు కాస్తా నేను ఆ రోజుల్లో మేము ఎంత స్వేచ్ఛగా జీవించేవాళ్ళం, ఈ రోజుల్లో అతిపరిమితంగా/అరుదుగా లభించేవన్నీ ఆ రోజుల్లో మేము ఎంతగా మనసారా ఆస్వాదించేవాళ్ళం అంటూ చెప్తుండేసరికి బుద్దిగా ఆలకించసాగాడు.
"నీకో సంగతి తెలుసా? నా చిన్నప్పుడు నీళ్ళకి కొదవే ఉండేది కాదు. ఏటి పక్క ఊరు కదా, 30/40 అడుగులలోనే తియ్యటి మంచి నీళ్ళు పడేవి! అంత పెద్ద ఇల్లు శుభ్రం చెయ్యటం, వాకిలి అంతా రోజూ కల్లాపి చల్లటం, అంతా మంచి నీటితోనే. ఇల్లళ్ళోనేకాక వీధికొక పంపు ఉండేది. కొలతలు పెట్టుకుని వాడటం, గుంటలు తవ్వి వాన నీళ్ళు దాచిపెట్టుకోవటం ఇలాంటివన్నీ కనీ వినీ ఎరగం మేము!"
ప్రస్తుత పరిస్థితితో బేరీజు వేసుకున్నాడు కాబోలు, బుజ్జిగాడి మోములో ఆశ్చర్యంతో కూడిన చిన్నపాటి అసూయ....
ఆ మాత్రం చోదనం చాలు నాకు, మరిన్ని విశేషాలు వివరించటానికి సిద్దపడి పోయాను..
"అప్పట్లో ఫలానా చైనా దేశంలో ప్రభుత్వం ఒకరికంటే ఎక్కువ పిల్లల్ని కనొద్దని రూల్సు పెట్టేదని విడ్డురంగా చెప్పుకునే వాళ్ళం. ప్చ్....ఇప్పుడు మీకాలంలో ఇలాంటివి మన దేశంలో కూడా చూడబోతున్నామని ఎన్నడూ ఊహించలేదురా! ఏ పండగకో పబ్బానికో తప్ప ఎన్నడూ బంధువులే కనపడటం లేదు! నా చిన్నప్పుడు ఏ ఇల్లు చూసినా ఎప్పుడూ సందడి సందడిగా కళకళలాడుతూ ఉండేవి. ఏ పిల్లవాడిని తీసుకున్నా కనీసం 3/4 బాబాయ్‌లు, అత్తమ్మలు....ఇంట్లో ప్రతి రోజూ పండగ రోజులానే ఉండేది"
'చిన్నపాటి ' అసూయకాస్తా కొంచెం పెరిగి పెద్దదయ్యింది. అందుకు అనుగుణంగా నా జోరూ కూడా పెరిగింది....
"చెప్తే నమ్మవుకాన్రా, అప్పట్లో ఇలా చెట్టు చెట్టుని లెక్క పెట్టుకుని కాపాడుకోవటం, ప్రతి సంవత్సరం ఇన్ని చెట్లు నాటాలి అని కార్యక్రమాలు పెట్టుకోవటం మాకు తెలియవు. ఊర్లోకానీ బస్తీలోకానీ ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు కళకళలాడుతుండేవి. "ఒక చెట్టు నరికితే రెండు చెట్లు నాటాలి" లాంటి రూల్సూ చెత్తా ఏమీ అవసరం ఉండేవికాదు. లెక్కకు మిక్కిలి చెట్లు ఉండేవిమరి!"
అప్పటిదాకా లీనమైపోయి వింటున్న వాడు ఇక ఎదో అడగాలని నోరు తెరిచాడు. బహుశా అలనాటి మధురస్మృతులనుంచి మరేదైనా విశేషం తెలుసుకోవాలనేమో. "ఏంటి చెప్పు" అన్నట్లు కళ్ళెగరేసాను, కించిత్ గర్వంతో...
"మీరందరూ ఆ రోజుల్లో అంతలా జల్సా చెయ్యకుండా జాగ్రత్తపడి ఉంటే, మాకిప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదుకదా తాతయ్యా?"
Tuesday, 20 May 2008
ఆ రోజుల్లో ....
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
వాత పెట్టాడుకదా మీ గడుగ్గాయి.. ఇంతకీ వాడికి ఎన్నెళ్ళు?
అయినా మీ చాదశ్తం కాకపోతే.. కుటుంబనియంత్రణ లాంటి విషయాలు వాడితో చర్చిస్తారా.. ఇంకా నయం మీవాడు అక్కడితో వదిలిపెట్టాడు. లేకపోతే ఇంకా ఏమేమి అనేవాడో
@ చక్రవర్తి గారు:
ఇంకో 35/40 సంవత్సరాల తర్వాత మీ ప్రశ్నకి జవాబు చెప్పగలనేమో :-)
"మనం మన భవిష్యతరాలకి ఏమిస్తున్నాం?" అన్న ఉద్దేశ్యంతో వ్రాశాను ఈ టపా!
చాలా బాగా చెప్పారు
కొసమెరుపు బాగుంది. బహుసా మీ ఇనిమనవడు మీ మనవడికి అంతకంటే పెద్ద కొసమెరుపు ఇస్తాడేమో? పరిస్థితులు అలాగే ఉన్నాయి.
బొల్లోజు బాబా
ఈ పోస్ట్ ఉద్దేశ్యం నాకు అర్ధం కాలేదు. వాళ్ళు జల్సాలు ఏమి చేయలేదు మనమే నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ పరిస్థితి కల్పించాము.ఏమో మరి నేను కన్విన్సు కాలేదు
శైల బాల గారు: మీరన్నది నిజమే! కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. మనం చిన్నప్పుడు (ఒక 20 ఏళ్ళ ముందు) ఎలా వృధా చేసేవాళ్ళమో చెప్పి, అలా చెయ్యటం వల్ల మన భవిష్యతరాలకూ మనం ఏ మిగులుస్తున్నామో ఆలోచిద్దాం - అన్న ఉద్దేశ్యంతో వ్రాసింది ఈ టపా
Post a Comment