అద్దె ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఏజంట్‌ని విసిగించి, వడపోసి తిరగ్గా తిరగ్గా దొరికిందో చక్కటి ఇల్లు, అందులోని పై పోర్షను. కన్నడ రాజకీయాలు, కుంబ్లే రిటైర్మెంటు, బెంగళూరు పుట్టుపూర్వోత్తరాలూ ఇంటి ఓనరుతో తీరిగ్గా చర్చించాక, ఉభయతారకంగా వ్యవహారం తెముల్చుకుని వస్తుండగా కనిపించింది....ఇంటి పక్కనే ఓ పెద్ద చెత్త కుప్ప!
పక్క స్థలం ఎప్పటినుంచో ఖాళీగా ఉండటం వల్ల జాలిపడి మున్సిపాలిటీ వాళ్ళే దాన్ని అనధికారంగా ఆ ఏరియా చెత్తకి డంపింగ్ యార్డుగా డిక్లేర్ చేసేసార్ట. ఇంకేం....విషయం దాచిపెట్టినందుకు ఏజంట్‌ని చివాట్లు పెట్టటం, ఓనర్‌కి ఇంకొన్ని కబుర్లు చెప్పి అడ్వాన్స్ వెనక్కి తీసుకోవటం, చక చకా జరిగిపోయాయి. కాదా మరి! దరిద్రపు చెత్త కుప్పని మరీ పక్కనే పెట్టుకుని ఎవరుంటారాఇంట్లో!!
కాలక్రమంలో ఇంకొందరు ఏజంట్లూ, ఇంకొన్ని అద్దె ఇళ్ళూ (మళ్ళీ ఎక్కడా చెత్త బారిన పడకుండా) మారాక ఓ శుభ ముహుర్తంలో సొంత ఇంట్లో గృహప్రవేశం కూడా చేశాము. పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కాబట్టి ఏ పూటకాపూటా ఇంటి నుంచే చెత్త తీసికెళ్ళటం, ఏ రోజుకారోజు ట్రక్‌లో బయటకు తోలించటంలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ప్రాణానికి హాయిగా రోజులు గడిచిపోతుండగా...
ఓ శుభోదయాన వ్యాహాళిలో పరిశుభ్రమైన పరిసరాలను ఆస్వాదిస్తున్న సమయంలో మొదలైంది ఒక చిన్న ఆలోచన. ఇంతకాలం చెత్త అని అసహ్యించుకుంటున్నది, నా బోటి వాళ్ళు అందరూ ఎవరికి వారే తమ ఇళ్ళు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని ఊరిమీదకి వదిలేసిందే కదా!
ఈ చెత్త అంతా ఎక్కడికి వెళ్తుందో, దాన్ని తగలబెట్టటం వల్ల ఎంత అనర్ధాలు ఉంటాయో మనకి పట్టదా?
వంటింట్లో మిగిలిన తిండి, ప్లాస్టిక్, ఇంకా నానా రకాల చెత్త, ఇలా ఒకదానికొకటి పొసగనివన్నీ కలిపి కట్టకట్టి చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో పడేసి మన బాధ్యత అయిపోయిందనుకోవటమేనా?
ఈ చెత్త కుప్పల్లో తిండి కోసం వచ్చిన మూగజీవాలు, ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తినలేక అలాగే వాటిని కూడా మింగి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నా మనకి పట్టదా?
అసలు ఇన్ని వేల సంవత్సరాలనుంచి లేని ఈ చెత్త సమస్య ఇప్పుడిప్పుడే మనల్ని ఎందుకు పీడిస్తుంది?
ఎందుకు పల్లెటూర్లలో కూడా ఊరి చివర్లలో ప్లాస్టిక్ చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయి?
ఇంతగా అడాన్స్ అయ్యాం అని చెప్పుకుంటున్న మనం ఇంతకుముందెన్నడూలేని ఈ సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది పురోగమనమా?
పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని ఆర్భాటాలకి పోయి వాటి గుర్తుగా మనం ఏం మిగులుస్తున్నాం? మన సంతోషాలు, గొప్పలు తప్ప మనకంటూ బాధ్యత లేదా?
అవసరం ఉన్నంతవరకు వాడుకోవటం ముందుచూపు; అవకాశం ఉందికదా అని వాడుకోవటం నిర్లక్ష్యం. ఈ చిన్న తేడా తెలియకపోవటమే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం
అసలు ప్రకృతిలో చెత్త అనే మాటకే అర్థం లేదు! ఒక చోట ఒక రూపంలో వాడుకోగా మిగిలినవి వేరొక చోట వేరొక రూపంలో వాడుకోవటం తప్ప . ఇది తెలుసుకోవటానికి పశువులమీద ఆధారపడ్డ మన సంప్రదాయ వ్యవసాయం / పల్లె జీవనాన్ని గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది
ఈ చిన్న క్లూ చాలు. ఇక్కడే మొదలెడదాం. తిరిగివ్వటం నేర్చుకుందాం! మన ఇంట్లో, మన చేతులతో 'చెత్త పని' మొదలెడదాం !!
Wednesday, 10 August 2011
చెత్త పని - 1
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
శివ గారు ఎప్పటిలా బాగా రాసారు.
ఓ శుభోదయాన వ్యాహాళిలో పరిశుభ్రమైన పరిసరాలను ఆస్వాదిస్తున్న సమయంలో మొదలైంది ఒక చిన్న ఆలోచన. ఇంతకాలం చెత్త అని అసహ్యించుకుంటున్నది, నా బోటి వాళ్ళు అందరూ ఎవరికి వారే తమ ఇళ్ళు మాత్రం మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని ఊరిమీదకి వదిలేసిందే కదా!
ఈ వాక్యం నన్ను బాగా వెంటాడుతోంది.
పర్యావరణం మీద ప్రేమ , బాధ్యతా ఉంది అనుకునే నన్ను ఆలోచనలో పడేసింది.
శైలు ఫాలో అయ్యే బ్లాగ్స్ లో మీ బ్లాగ్ ఉండటం చూసి అప్పటినుంచి నేను కూడా చదువుతున్నాను. చెత్త గురించి మీరు రాసింది చాల బావుంది.
అవసరం ఉన్నంతవరకు వాడుకోవటం ముందుచూపు; అవకాశం ఉందికదా అని వాడుకోవటం నిర్లక్ష్యం. ఈ చిన్న తేడా తెలియకపోవటమే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం.ఈ వాక్యం బాగా నచ్చింది.
మిగతా భాగాలు త్వరగా పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
గీతాంజలి.
శైల బాల గారు:
మీ అభిమానానికి ధన్యవాదాలు! చాలా ముఖ్యమైన విషయం మనం అలక్ష్యం చేస్తున్నామని నా అంతట నేను తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే ఈ అంశం గురించి కొంచెం వివరంగా వ్రాద్దామనుకుంటున్నాను.
మీకు ప్రకృతి మీద ప్రేమ లేదంటే మాత్రం నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను :-) ఇక్కడ ఒక సూక్షమైన తేడా ఉంది. నిజానికి మీరన్న ప్రేమ, బాధ్యత గురించి విడిగా ఒక టపానే వ్రాయాలి. చాలా కాలం నుంచి మనసులో ఉన్న విషయం ఇలా గుర్తు చేసినందుకు మరొక్క సారి ధన్యవాదాలు. వీలైనంత త్వరలో ఇది కూడా వ్రాస్తాను
గీతాంజలి గారు:
మీ ప్రోత్సాహానికి మనసారా ధన్యవాదాలు!!
ముందు అనుకున్నంతటి కంటే కొంచెం వివరంగా వ్రాద్దామని అనుకోవటం వల్ల కొంచెం ఆలస్యం అవుతోంది. అదీకాక ఇది మనం ఒక అలవాటుగా మార్చుకోవలసిన, నేర్చుకోవలసిన పని కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరికి నమ్మకం, ఇష్టం ఏర్పడాలి. అలా ఏర్పడేంత స్పష్టంగా నేను చెప్పగలగాలి. దానికి తోడు రచన అనేది నాకు సహజంగా అబ్బింది కాదు కాబట్టి అక్షరం అక్షరం పేర్చుకోవటానికి కొంచెం సమయం పడుతోంది :-)
ఒక్క నిమిషం ఆలోచించేలా చేసింది ఈ టపా..
ఇది వరకటి కన్నా ఈ మద్య కాస్త ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు తెల్సుకుని కొంతమందయినా దాని వాడకం తగ్గించారు...ఇది కాస్త మంచి విషయం...!!
మంచి టపా :)
కిరణ్ గారూ..
మీరన్నది నిజం! మునుపటి కంటే ఇప్పుడు కొంచెం నయం. చిన్న టౌన్‌లలో కూడ మెల్లగా తెలిసి వస్తుంది.
అయితే నేను చెప్పదల్చుకుంది కేవలం ప్లాస్టిక్ గురించే కాదు. ఎందుకంటే కేవలం ప్లాస్టిక్ వాడటం నియత్రించుకున్నా చెత్తతో సమస్య తీరిపోదు. సమస్యకి మూలం మన అలవాట్లలో ఉంది. వీలైనంత వివరంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
వీలైంత త్వరలో రెండో టపా వ్రాస్తాను - ఒక్కక్క టపా వ్రాయటానికి ఇంతింత సమయం తీసుకుంటున్నాను...ఓర్పు చేసుకుని క్షమించగలరు :-)
Post a Comment