కొన్నాళ్ళ క్రిందటి ఒక సాదా సీదా ఘటన..
దేశంకాని దేశంలో ఓ శుభోదయాన ఆఫీస్‌కి వెళ్ళటానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తూ, దారెంబడి వచ్చిపోయే కార్లనీ, దారి పక్కన విచ్చుకున్న గడ్డి పూలనీ, తేట తెలుగులాంటి ఆకాశాన్ని చూస్తూ, ఆలోచిస్తూ ఉండగా...
ఎదురుగా ఓ పెద్దాయన..మొహమాటం లేకుండా తిన్నగా నా దగ్గరకి వచ్చేసి, చుట్టూ ఉన్న చెట్లనీ, ఎగురుతున్న పిట్టలనీ నాకు చూపిస్తూ ఏదో చెప్పటం మొదలెట్టారు..
జర్మన్ భాషలో అక్షరాలు, అంకెలు తప్ప పై తరగతులు చదువుకోని నాకు ఆయన చూపించేవి కనబడటం తప్ప, చెప్పేది ఒక్క ముక్కా అర్థం కాలేదు; అర్థం కాలేదు పాపం అని ఆయన కూడా పెద్దగా జాలి చూపించలేదు! ఈ సారి నీలాకాశం, ఋతువులు అలా అలా సాగింది వాక్ప్రవాహం ...
ఆ ప్రవాహం అలా ఆయన అత్త మామలగురించి, చిన్నప్పటి సంగతుల గురించి, రెండో ప్రపంచ యుద్దం గురించీ, ఇలా మరెన్నో పాయలను కలుపుకుని స్వరరాగ గంగా ప్రవాహంలా మారుతుండగా, నాకు ఓ విషయం స్ఫురించింది. ఆయన మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కాక పోయినా, చెప్పే విషయం మాత్రం అర్థం అవుతుంది నాకు..స్పష్టంగా! అంతే కాదు, ఆయన చెప్పేది నాకు సోదిలా అనిపించటం లేదు. ప్రతి మాటా మనసు పెట్టి వింటున్నాను..ఏదో మొహమాటనికి నటించకుండా. ప్రతిస్పందిస్తూ.
ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఒక మతం కాదు, ఒక వయసు కాదు. ఏదీ సరి పోలదని ఆయనికీ తెలుసు. అయినా నాతో మాట్లాడాలని, నాకు అర్థం కాకపోయినా నాకు ఎదో చెప్పాలని ఆయనికి ఎందుకు అనిపించింది??
స్థూలంగా చూస్తే ఇది అంతగా పట్టించుకోవలసినవసరం లేని ఒక సాదా సీదా ఘటనే - ఉబుసుపోక ఓ పెద్ద మనిషి చెప్పిన కబుర్లు. కాని నిజంగా ఇందులో ఎమీ లేదా?
మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నిజాయితీగా మనసులో భావం పంచుకోవటానికి అసలు నిజంగా భాషతో అవసరం ఉందా? ఇలా మనసుతో మాట్లాడే అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఆ అవకాశం మనం కల్పించుకుంటున్నామా?
అసలు ఇలా మనం సాటి మనిషితో మాట్లాడి ఎన్నాళ్లయింది - మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకుని, మొహమాటలు, భేషజాలు లేకుండా? నోరు తెరిచి ఒక మాట చెప్పుకోవటానికి ఎన్నో వడపోతలు. అంతకు ముందు మనలోపలి మనిషి మీద కప్పుకున్న ఎన్నో ముసుగులు!
మార్చుకోవటానికీ, నేర్చుకోవటానికీ జీవితంలో అనూహ్యమైన మలుపులు, అపూర్వమైన మనుషులే తారసపడనవసరం లేదు. అర్థం చేసుకునే హృదయం, స్పందించే మనసు ఉంటే మనకు ఎదురై ప్రతిఘటనా, ప్రతిమనిషి, నేర్పించే గురువులే కదా!
Sunday, 19 June 2011
ముసుగు
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
బాగా చెప్పారు.
@ Anonymous గారు: ధన్యవాదాలు!
ayyagaru meeru baaga chepparu..
శివ గారు చాల రోజుల తర్వాత మంచి అంశం గురించి రాసారు. మీరు చెప్పిన విధానం క్లుప్తంగా చక్కగా ఉంది.ఇలాంటి అనుభవం నాకు ఉంది.ఒకరోజు నేను మా కాలనీ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో కొంచం అలసటగా అనిపించి ఒక ఇంటిముందు కాసేపు కూర్చున్నాను . అంతలో అక్కడ పని చేస్తున్న ఒకావిడ వచ్చి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు. తర్వాత కాసేపు ఏవో మాట్లాడారు. చివరలో ఒక మాట చెప్పారు కష్టం వచినపుడు మనసు ముసురుపట్టిన ఆకాశం అవుతుంది కాని వాన వెలిసాక అంత తెరిపిగా ఉంటుంది.ఎంత పెద్ద కష్టం అయిన మన ఆత్మవిశ్వాసం ముందు తల వంచాల్సిందే అని చెప్పారు. ఆవిడా పెద్దగ చదువుకున్న ఆవిడా కూడా కాదు. అసలు ఆ సమయంలో నాకు ఆ మాట ఎందుకు చెప్పాలని అన్పించిందో నేను చాల ఆలోచించాను. పోనీ ఆవిడకి నాకు పరిచయం ఉందా అంటే అది లేదు. ఆవిడని నేను నన్ను ఆవిడా మొదటిసారి చూడటం తర్వాత ఆవిడా కోసం చాల వెతికాను కాని ఆవిడ ఆ ఒక్కరోజే పనిలోకి వచ్చారట ...కాని ఆ సంఘటన గుర్తుకు వచినప్పుడల్లా ఆ మాట నాకు ఎందుకు చెప్పారు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత నాకు ఏదయినా సమస్య వస్తే ఆవిడా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి.
మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నిజాయితీగా మనసులో భావం పంచుకోవటానికి అసలు నిజంగా భాషతో అవసరం ఉందా?
meeru annadi nijam. manasu vippi matladukovadaniki bhashato avasaram ledemo. Thanks for wonderful post
Anonymous గారు, శైల బాల గారు: ఇంత ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి!! కొన్ని రోజులుగా ఇటుకేసి రావటం కుదరలేదు. మళ్ళీ ఇంకెప్పుడూ జరగదని సవినయంగా మనవి చేస్తూ...
@ Anonymous గారు: మీ అభిమానానికి కృతఙతలు!! నాకు వీలైనంతలో ఇలాంటి విషయాలు పంచుకోవటానికి ప్రయత్నిస్తాను.
@ శైల బాల గారు: ఎంత మంచి అనుభూతిని పంచుకున్నారు! సాటి మనిషి బాధని పంచుకోవటానికి, ఓదార్పుని ఇవ్వటానికి మనిషిగా పుట్టటం కంటే వేరే అర్హత ఏమీ అవసరం లేదు కదా? అది మన కనీస బాధ్యత కూడా. మనం సో కాల్డ్ అర్హతలు (చదువులు, డిగ్రీలు గట్రా) పెంచుకుంటూ పోయిన కోద్దీ, మన కనీస బాధ్యతలనే మరుస్తున్నాం. Thanks once again for sharing this!
శివ గారు మీ పోస్ట్ చదివాక కామెంట్ పెట్టాక కూడా నేను ఇది మర్చిపోలేదు. ఆ జర్మన్, నాతొ మాట్లాడిన ఆవిడా మనకి తెలియకపోయినా ఎందుకు మాట్లాడారు అని ? ఈ మధ్య The Alchemist నవల చదివాక నాకు జవాబు దొరికింది.అందులో రచయిత విశ్వ భాష గురించి చెప్పారు. ఆ భాష మనసుకి సంబంధించింది.బహుశా అలా మీకు జర్మన్ రాకపోయినా ఆ జర్మన్ చెప్పింది అర్ధం అయి ఉంటుంది.అలాగే ఆయనకి మీరు అయితే ఆయాన చెప్పేది వింటారు అని అనిపించి ఉంటుంది.మీకు కుదిరితే ఆ నవల తప్పక చదవండి.
శైలబాల గారూ...మీరు చెప్పింది నిజం అయ్యిండొచ్చు! తలచుకుంటే ఇప్పటికీ అది నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది!
వీలైతే ఆ బుక్ గురించి కొంచెం వివరాలు పంపగలరు
Post a Comment