Sunday 28 August 2011

చెత్త పని - 2 : మూలాల్లోకి...

చెత్తవల్ల సమస్యల గురించి తెలుసుకున్నాం. మరి వెంటనే కార్యాచరణ మొదలెట్టేద్దామా? ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, వేర్వేరు రకాల చెత్తని వేరు చెయ్యటం, కంపోస్టు చెయ్యటం వగైరా వగైరా...

అలా ఎకాయెకిన లేడికి లేచిందే పరుగు అన్నట్టు పనిమొదలుపెట్టేస్తే, నాకుతెలిసి కేవలం రెండే రెండు నెలల్లో మనం తిరిగి ఇప్పటి అలవాట్లకే వెనక్కి వచ్చేస్తాం! ఎందుకంటే ఈ విషయంలో సరైన అవగాహన, దృక్పథం చాలా అవసరం. అవి లోపించబట్టే ఇన్నాళ్ళుగా మనం ఇలాంటి మార్పుకి అలవాటుపడలేకపోతున్నాం. కొంచెం వివరంగా చెప్పాలంటే...

ప్లాస్టిక్ వాడొద్దు అని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నామనుకోండి...రేపట్నుంచి చక్కగా పేపర్ సంచులు గట్రా మొదలుపెట్టేస్తాం. నిజమే..మనం తప్పకుండా ఆచరించాల్సిన విషయం ఇది - ప్రతి ఊరిచివర పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలను కళ్ళారా చూస్తునే ఉన్నాం కదా! కాని వంటింట్లో మిగిలినది, ఇంకా మిగతా చెత్త సంగతి?? దాన్నిమాత్రం చక్కగా చెత్తకుప్పలో పారేసి వస్తాం. ఈ మిగిలిన చెత్తని తీసుకెళ్లటానికి మున్సిపాలిటీ ట్రక్ ఎప్పటిలానే వస్తుంది. ఎప్పటిలానే అంతా తీసుకెళ్ళి ఊరిచివర పారేసి తగలబెట్టేస్తారు. అంటే ఈ విషయంలో మనకి సరైన అవగాహన లేక ఎలాగొలా వదిలించుకోవాలని చూస్తున్నట్లే కదా?

అసలు దేన్నైనా "చెత్త" అంటున్నామంటే అది పనికిరానిదని కాదు! దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏంచెయ్యాలో మనకి తెలియదని..అంతే! అలాంటప్పుడు లోపం మనది కాదా?

ఒక్కసారి మూలాల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం...

ఎప్పుడైనా ఆరుబయట పడి ఉన్న అరటి తొక్కనో, కూరగాయల ముక్కల్నో గమనించారా? ఒక రోజు, రెండు రోజులు, ఒక వారం కనిపిస్తాయి. తర్వాత? ఏమైపోయాయి?? మనం తీసికెళ్ళి ఎక్కడా పారెయ్యకుండానే, ఎక్కడా తగలబెట్టకుండానే వాటంతటవే నేలలో కలిసిపోలేదూ???

అమ్మ (ప్రకృతి) చెప్తున్న ఈ చిన్న విషయం అర్థం చేసుకోగలిగితే చాలు. మనం ఎక్కడ మొదలు పెట్టాలో తేలిగ్గా అర్థం అవుతుంది. మనం వాడే ప్రతి వస్తువునీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో తిరిగి అక్కడికి చేర్చటమే మనం చెయ్యాల్సిందల్లా! ఇంకా వివరంగా చెప్పాలంటే..

1. వంటింటి చెత్త: పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ నేలనుంచి కదా మనకి వచ్చేది? అందుకని ఈ చెత్తని తిరిగి నేలకే ఎరువుగా అందజెయ్యాలి (ఇది ఎంత తేలిగ్గా ఇంట్లోనే చెయ్యొచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం)

2. ప్లాస్టిక్: తప్పని సరై ప్లాస్టిక్ లాంటివి వాడుతున్నప్పుడు వాటిని తిరిగి రీసైకిల్ చేసే సంస్థలకి పంపించొచ్చు. ఎందుకంటే వీటిని అలా విసిరి పడేస్తే నేలలో కలిసిపోవు; తగలబెట్టనూకూడదు (ఈ విషయం ఇప్పటికీ చాలమందికి తెలియదు)

3. ఇనుము, మెటల్ గట్రా: వీటిని మిగతా వాటితో కలపకుండా, రీసైకిల్ చేసే సంస్థలకి పంపడమే

4. హానికరమైన చెత్త: ఎలక్ట్రానిక్, మెడికల్ లాంటివన్న మాట. మిగతా వాటికంటే కొంచెం కష్టం. ఎలక్ట్రానిక్ చెత్తని కూడ రీసైకిల్ చేసే సంస్థలు ఉన్నాయి. మెడికల్‌కి మాత్రం హాస్పిటల్స్ దగ్గర కనుక్కోవాల్సిందే

"పోద్దురూ...ఇంత వివరంగా చెత్తని వేరు చేసి ఏది ఎక్కడ ఇవ్వాలో కనుక్కుని మరీ చెయ్యాలా? అయ్యే పని కాదు!" అని అనేసుకుంటున్నారా?? అనుభవంతో చెప్తున్నాను..చాలా తేలిక పని. పోనీ ఇంకా తేలిగ్గా మొదలెడదామా??

ముందుగా వంటింటి చెత్త మాత్రం వేరుచెయ్యండి. ఇది మాత్రం బయట పడెయ్యకుండా కంపోస్టు చేద్దాం. ఎంచక్కా మన కుండీల్లో మొక్కలకే ఎరువుగా వాడుకోవచ్చు! ఇది అనుభవంలోకి వచ్చాక మిగతావి మొదలుపెడుదురు కాని. ఎందుకంటే, ప్రకృతి ఎంత తేలిగ్గా వంటింటి చెత్తని ఎరువుగా మార్చుకుని తనలో కలుపుకుంటుందో ఒకసారి మీ కళ్ళతో మీరే చూసాక, అసలు చెత్త గురించి మీకిప్పటిదాకా ఉన్న దృక్పథమే మారిపోతుంది! ఈ మార్పు గురించే టపా మొదట్లో చెప్పింది. ఇంకో విషయం...కేవలం ఇలా కంపోస్టు చెయ్యటం వల్లే మీ ఇంట్లోంటి బయటకి వెళ్ళే చెత్త 70% తగ్గిపోతుంది! ఎందుకంటే రోజువారి చెత్తలో ఒక్క వంటింట్లోనుంచి వచ్చేదే అంత ఉంటుంది

ఇలా ఉభయతారకంగా కంపోస్టును ఇంట్లోనే అతి సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాం...

4 comments:

kiran said...

చాల మంచి పాయింట్స్ చెప్పారండి..
అందరం పాటిస్తే బాగుండు..

Siva said...

కిరణ్‌గారూ,

చాలా కాలం నాకు తెలియక, తర్వాత తెలిసీ నిర్య్లక్ష్యంతో ఈ విషయం పట్టించుకోలేదు. ఇప్పటికీ చాలా మందికి చెత్త అంటే తీసికెళ్ళి బయటపడేస్తే పోయేదానికి ఇదంతా మనకెందుకు అనే అభిప్రాయం ఉంది. ఇది మారాలి. మనం ఒక్కరం మారితే ఏం ఉపయోగం అనుకోకుండా, మనం ఒక్కరం మారినా మనల్ని చూసి ఇంకొక్కరైనా మారతారేమో అని ఆలోచించాలి

అందుకే నాకు వీలైనంతలో ఈ విషయం గురించి తేలిగ్గా అర్థం అయ్యేటట్లు చెప్పదల్చుకున్నాను. ఇప్పటికే మా అపార్ట్‌మెంట్స్‌లో అందరికీ దీనిగురించి చెప్పేసి ఏమైనా ఇబ్బంది వస్తే ఉచిత సలహాలు/సర్వీసు ఇవబడును అనికూడా అనౌన్స్ చేసాను :-)

మీ ప్రోత్సాహానికి మళ్ళీ ధన్యవాదాలు! త్వరలో మూడో టపా (ఇంట్లోనే కంపోస్టు చేసుకోవటం) కూడా వ్రాస్తాను

Unknown said...

శివ గారు చాలా బావుంది. ముఖ్యంగా ఎక్కడో చదివింది కాకుండా మీరు ఆచరించాక చెప్పడం నాకు నచ్చింది.

Siva said...

శైలబాలగారూ..ధన్యవాదాలు! మనం నమ్మి, ఆచరించి, అనుభవంలోకి వచ్చాక ఇంకొకరికి చెప్పటం నిజంగా వేఱు!!