అద్దె ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఏజంట్‌ని విసిగించి, వడపోసి తిరగ్గా తిరగ్గా దొరికిందో చక్కటి ఇల్లు, అందులోని పై పోర్షను. కన్నడ రాజకీయాలు, కుంబ్లే రిటైర్మెంటు, బెంగళూరు పుట్టుపూర్వోత్తరాలూ ఇంటి ఓనరుతో తీరిగ్గా చర్చించాక, ఉభయతారకంగా వ్యవహారం తెముల్చుకుని వస్తుండగా కనిపించింది....ఇంటి పక్కనే ఓ పెద్ద చెత్త కుప్ప!
పక్క స్థలం ఎప్పటినుంచో ఖాళీగా ఉండటం వల్ల జాలిపడి మున్సిపాలిటీ వాళ్ళే దాన్ని అనధికారంగా ఆ ఏరియా చెత్తకి డంపింగ్ యార్డుగా డిక్లేర్ చేసేసార్ట. ఇంకేం....విషయం దాచిపెట్టినందుకు ఏజంట్‌ని చివాట్లు పెట్టటం, ఓనర్‌కి ఇంకొన్ని కబుర్లు చెప్పి అడ్వాన్స్ వెనక్కి తీసుకోవటం, చక చకా జరిగిపోయాయి. కాదా మరి! దరిద్రపు చెత్త కుప్పని మరీ పక్కనే పెట్టుకుని ఎవరుంటారాఇంట్లో!!
కాలక్రమంలో ఇంకొందరు ఏజంట్లూ, ఇంకొన్ని అద్దె ఇళ్ళూ (మళ్ళీ ఎక్కడా చెత్త బారిన పడకుండా) మారాక ఓ శుభ ముహుర్తంలో సొంత ఇంట్లో గృహప్రవేశం కూడా చేశాము. పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కాబట్టి ఏ పూటకాపూటా ఇంటి నుంచే చెత్త తీసికెళ్ళటం, ఏ రోజుకారోజు ట్రక్‌లో బయటకు తోలించటంలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ప్రాణానికి హాయిగా రోజులు గడిచిపోతుండగా...
ఓ శుభోదయాన వ్యాహాళిలో పరిశుభ్రమైన పరిసరాలను ఆస్వాదిస్తున్న సమయంలో మొదలైంది ఒక చిన్న ఆలోచన. ఇంతకాలం చెత్త అని అసహ్యించుకుంటున్నది, నా బోటి వాళ్ళు అందరూ ఎవరికి వారే తమ ఇళ్ళు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని ఊరిమీదకి వదిలేసిందే కదా!
ఈ చెత్త అంతా ఎక్కడికి వెళ్తుందో, దాన్ని తగలబెట్టటం వల్ల ఎంత అనర్ధాలు ఉంటాయో మనకి పట్టదా?
వంటింట్లో మిగిలిన తిండి, ప్లాస్టిక్, ఇంకా నానా రకాల చెత్త, ఇలా ఒకదానికొకటి పొసగనివన్నీ కలిపి కట్టకట్టి చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో పడేసి మన బాధ్యత అయిపోయిందనుకోవటమేనా?
ఈ చెత్త కుప్పల్లో తిండి కోసం వచ్చిన మూగజీవాలు, ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తినలేక అలాగే వాటిని కూడా మింగి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నా మనకి పట్టదా?
అసలు ఇన్ని వేల సంవత్సరాలనుంచి లేని ఈ చెత్త సమస్య ఇప్పుడిప్పుడే మనల్ని ఎందుకు పీడిస్తుంది?
ఎందుకు పల్లెటూర్లలో కూడా ఊరి చివర్లలో ప్లాస్టిక్ చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయి?
ఇంతగా అడాన్స్ అయ్యాం అని చెప్పుకుంటున్న మనం ఇంతకుముందెన్నడూలేని ఈ సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది పురోగమనమా?
పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని ఆర్భాటాలకి పోయి వాటి గుర్తుగా మనం ఏం మిగులుస్తున్నాం? మన సంతోషాలు, గొప్పలు తప్ప మనకంటూ బాధ్యత లేదా?
అవసరం ఉన్నంతవరకు వాడుకోవటం ముందుచూపు; అవకాశం ఉందికదా అని వాడుకోవటం నిర్లక్ష్యం. ఈ చిన్న తేడా తెలియకపోవటమే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం
అసలు ప్రకృతిలో చెత్త అనే మాటకే అర్థం లేదు! ఒక చోట ఒక రూపంలో వాడుకోగా మిగిలినవి వేరొక చోట వేరొక రూపంలో వాడుకోవటం తప్ప . ఇది తెలుసుకోవటానికి పశువులమీద ఆధారపడ్డ మన సంప్రదాయ వ్యవసాయం / పల్లె జీవనాన్ని గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది
ఈ చిన్న క్లూ చాలు. ఇక్కడే మొదలెడదాం. తిరిగివ్వటం నేర్చుకుందాం! మన ఇంట్లో, మన చేతులతో 'చెత్త పని' మొదలెడదాం !!
Wednesday, 10 August 2011
చెత్త పని - 1
Sunday, 19 June 2011
ముసుగు
కొన్నాళ్ళ క్రిందటి ఒక సాదా సీదా ఘటన..
దేశంకాని దేశంలో ఓ శుభోదయాన ఆఫీస్‌కి వెళ్ళటానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తూ, దారెంబడి వచ్చిపోయే కార్లనీ, దారి పక్కన విచ్చుకున్న గడ్డి పూలనీ, తేట తెలుగులాంటి ఆకాశాన్ని చూస్తూ, ఆలోచిస్తూ ఉండగా...
ఎదురుగా ఓ పెద్దాయన..మొహమాటం లేకుండా తిన్నగా నా దగ్గరకి వచ్చేసి, చుట్టూ ఉన్న చెట్లనీ, ఎగురుతున్న పిట్టలనీ నాకు చూపిస్తూ ఏదో చెప్పటం మొదలెట్టారు..
జర్మన్ భాషలో అక్షరాలు, అంకెలు తప్ప పై తరగతులు చదువుకోని నాకు ఆయన చూపించేవి కనబడటం తప్ప, చెప్పేది ఒక్క ముక్కా అర్థం కాలేదు; అర్థం కాలేదు పాపం అని ఆయన కూడా పెద్దగా జాలి చూపించలేదు! ఈ సారి నీలాకాశం, ఋతువులు అలా అలా సాగింది వాక్ప్రవాహం ...
ఆ ప్రవాహం అలా ఆయన అత్త మామలగురించి, చిన్నప్పటి సంగతుల గురించి, రెండో ప్రపంచ యుద్దం గురించీ, ఇలా మరెన్నో పాయలను కలుపుకుని స్వరరాగ గంగా ప్రవాహంలా మారుతుండగా, నాకు ఓ విషయం స్ఫురించింది. ఆయన మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కాక పోయినా, చెప్పే విషయం మాత్రం అర్థం అవుతుంది నాకు..స్పష్టంగా! అంతే కాదు, ఆయన చెప్పేది నాకు సోదిలా అనిపించటం లేదు. ప్రతి మాటా మనసు పెట్టి వింటున్నాను..ఏదో మొహమాటనికి నటించకుండా. ప్రతిస్పందిస్తూ.
ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఒక మతం కాదు, ఒక వయసు కాదు. ఏదీ సరి పోలదని ఆయనికీ తెలుసు. అయినా నాతో మాట్లాడాలని, నాకు అర్థం కాకపోయినా నాకు ఎదో చెప్పాలని ఆయనికి ఎందుకు అనిపించింది??
స్థూలంగా చూస్తే ఇది అంతగా పట్టించుకోవలసినవసరం లేని ఒక సాదా సీదా ఘటనే - ఉబుసుపోక ఓ పెద్ద మనిషి చెప్పిన కబుర్లు. కాని నిజంగా ఇందులో ఎమీ లేదా?
మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నిజాయితీగా మనసులో భావం పంచుకోవటానికి అసలు నిజంగా భాషతో అవసరం ఉందా? ఇలా మనసుతో మాట్లాడే అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఆ అవకాశం మనం కల్పించుకుంటున్నామా?
అసలు ఇలా మనం సాటి మనిషితో మాట్లాడి ఎన్నాళ్లయింది - మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకుని, మొహమాటలు, భేషజాలు లేకుండా? నోరు తెరిచి ఒక మాట చెప్పుకోవటానికి ఎన్నో వడపోతలు. అంతకు ముందు మనలోపలి మనిషి మీద కప్పుకున్న ఎన్నో ముసుగులు!
మార్చుకోవటానికీ, నేర్చుకోవటానికీ జీవితంలో అనూహ్యమైన మలుపులు, అపూర్వమైన మనుషులే తారసపడనవసరం లేదు. అర్థం చేసుకునే హృదయం, స్పందించే మనసు ఉంటే మనకు ఎదురై ప్రతిఘటనా, ప్రతిమనిషి, నేర్పించే గురువులే కదా!
Wednesday, 18 May 2011
నా చిన్నారి నేస్తాలు...
నా చిన్నారి నేస్తాల గురించి ఇప్పటి వరకు మీకు పరిచయం చెయ్యలేదు కదూ??
అవి నాకు ఆరోతరగతి నుంచి పరిచయం. అప్పుడు మాకు తెలుగులో వాటి గురించి కవిత ఉండేది..ఎవరు వ్రాసారో గుర్తు లేదు, కవిత కూడా గుర్తులేదు కానీ, నేస్తాలు ఇప్పటికీ ఉన్నాయి.
ఇక్కడ కూడా ఉన్నాయి..అవును, ఇక్కడ నేను రోజూ నడచి వెళ్ళేదారిలో కనిపిస్తాయి. చిట్టి చిట్టి నవ్వులతో తమని ఎవరైనా పలకరిస్తారేమో అని రోజూ ఆశగా ఎదురు చూస్తుంటాయి. దారిన పోయే ప్రతి వారినీ కుశలమడుగుతాయి. కానీ పాపం వాటిని ఎవరూ అసలు పట్టించుకోరు. ఇంకొందరైతే నిర్దాక్షిణ్యంగా వాటిని .... :-(
పాపం నేను దూరం నుంచి పలకరించగానే ఎంత సంతోషమో వాటికి..చిన్న పాటి స్పర్శకే ఎంత సంబరమో వాటికి! ఆ స్పర్శ కోసమే ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నట్లు! కాదా మరి.. మూణ్ణాళ్ళ ఆయువే ఇచ్చాడు వాటికా దేవుడు. ఆ ముణ్ణాళ్ళల్లోనే క్షణ క్షణ గండం!
ఇకనుంచైనా మనం ఈ చిట్టి నేస్తాలని అప్యాయంగా పలకరిద్దామా? అసలు మన సొమ్మేం పోతుంది నోరు తెరిచి "బావున్నావా?" అని వాటిని ఓ మాట అడిగితే? అడుగుతారు కదూ??
ఓ..ఇంతకీ ఈ నేస్తాలెవరో చెప్పనేలేదు కదూ.. ఈసారి నడిచి వెళ్ళేటప్పుడు కొంచెం తలదించి చుట్టూపక్కల వెతకండి కనిపిస్తాయి..
గడ్డి పూలు!!
అవును...పూజకీ, అలంకారానికీ పనికి రాని చిన్నపాటి గడ్డి పూలు. చూడగలిగే మనసు ఉంటే అవెంత అపురూపమో తెలుస్తుంది. వినగలిగే మనసు ఉంటే రోజూ అవి మనకి చెప్పుకునే ఊసులూ అర్థమౌతాయి. అలా తెలుసుకొని, అర్థం చేసుకొన్న నాడు తలదించుకునే నడుస్తాం మనం!